ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2030లో అహ్మదాబాద్ వేదికగా ఈ పోటీలు జరుగనున్నాయి. భారత్‌లో కామన్వెల్త్ క్రీడలు జరగడం ఇది రెండోసారి. తొలిసారి 2010లో రాజధాని ఢిల్లీ వేదికగా కామన్వెల్త్ గేమ్స్‌ను నిర్వహించారు. బుధవారం గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్ వార్షిక సర్వసభ్య సమావేశంలో దీన్ని అధికారికంగా ధ్రువీకరించారు. నైజీరియా నగరం అబుజా కూడా రేసులో ఉండడంతో భారత్‌కు క్రీడలను నిర్వహించే ఛాన్స్ దొరుకుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కానీ బుధవారం జరిగిన కామన్వెల్త్ బోర్డు వార్షిక సమావేశంలో అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకే మెజారిటీ సభ్య దేశాలు మొగ్గు చూపాయి. దీంతో క్రీడల నిర్వహణపై నెలకొన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. భారత్‌లోనే 2030 కామన్వెల్త్ గేమ్స్‌ను నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యింది. కాగా, భారత్‌కు మెగా పోటీలు నిర్వహించే అవకాశం దక్కడంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు.