వాషింగ్టన్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అమెరికా భారీ ఊరట కల్పించడానికి సిద్ధమైంది. ఈమేరకు ఎఫ్1 విద్యార్థి వీసాల్లో కీలక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం ఈ వీసాల జారీలో అనుసరిస్తున్న “ఇంటెంట్ టు లీవ్ ” నిబంధన రద్దు దిశగా డిగ్నిటీ యాక్ట్ 2025ను చట్టసభ్యులు ప్రతిపాదించారు. దీనివల్ల ఇకపై విదేశీ విద్యార్థులు (యుఎస్ స్టూడెంట్ వీసా) తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగి వెళ్తామని నిరూపించుకోవలసిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఎఫ్1 వీసా దరఖాస్తుల్లో (యుఎస్ వీసా రూల్స్) చాలా వరకు ‘ ఇంటెంట్ టు లీవ్ రూల్ కిందే తిరస్కరణకు గురవుతున్నాయి.
ఈ నిబంధన ప్రకారం దరఖాస్తుదారులు తాత్కాలిక స్టే తరువాత (చదువు పూర్తయిన వెంటనే ) అమెరికా విడిచి వెళ్లిపోతామని కాన్సులర్ అధికారి వద్ద నిరూపించుకోవలసి ఉంటుంది. దీనికోసం దరఖాస్తుదారులు తమ స్వదేశంలో ఉన్న తమ ఆస్తులు లేదా ఉద్యోగావకాశాలకు సంబంధించిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులకు ముఖ్యంగా భారతీయులకు ఈ నిబంధన కఠినంగా మారింది. ఈ ఏడాది భారత విద్యార్థులకు ఎఫ్1 వీసాల జారీ సంఖ్య భారీగా తగ్గింది. ఈ వీసాల తిరస్కరణల్లో అత్యధికం ‘ ఇంటెంట్ టు లీవ్’ ను నిరూపించుకోలేని అభ్యర్థులవే ఉండటం గమనార్హం.
ఈ నేపథ్యం లోనే తాజా చట్టం ఇలాంటి విద్యార్థులకు ఊరట కల్పించే అవకాశం ఉంది. ‘ తిరిగెళ్లే ఉద్దేశం ఉందా ? అనే ప్రశ్న లేకుండా వీసాలు జారీ చేస్తే.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు బిల్లు దశలోనే ఉన్నాయి. అమెరికా కాంగ్రెస్ ఉభయసభల్లో ఇది ఆమోదం పొంది అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాత ఈ డిగ్నిటీ చట్టం అమల్లోకి రానుంది. మరోవైపు ఎఫ్1 వీసాల్లో ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’ ను తొలగించే దిశగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ మార్పులు చేపట్టింది. ఎంతకాలం అంటే అంతకాలం చదవాలనుకునే వీలు లేకుండా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన విద్యార్థి వీసాలను మంజూరు చేయాలని ప్రతిపాదించింది.