రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బిఆర్‌ఎస్ నట్టేట ముంచిందని, ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పటంతో ఇప్పుడు మైండ్ కూడా దెబ్బతిన్నట్టు బిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిఆర్‌ఎస్ నాయకులపై మండిపడ్డారు. బిఆర్‌ఎస్‌శాసనసభ సభ్యుడు హరీశ్ రావు చేసిన అసత్య వ్యాఖ్యలను మంత్రి తుమ్మల బుధవారం ఓ ప్రకటనలో ఖండించారు. ఇష్టమొచ్చిన ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేసి, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, రాష్ట్ర డిస్కంలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 90 వేల కోట్ల అప్పుల్లో ముంచిందని తుమ్మల ఆరోపించారు. అవసరం లేకపోయినా ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారని ఆయన ధ్వజమొత్తారు. బొగ్గు లేని దామరచర్లలో థర్మల్ పవర్ ప్లాంట్ కట్టి ప్రజలకు భారం – నాయకులకు లాభం అనే కుట్రను అమలు చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. భద్రాద్రిలో కాలం చెల్లిన టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించి జెన్‌కోను దెబ్బతీశారని, ఎన్‌టిపిసి విద్యుత్తు విషయంలో బిఆర్‌ఎస్ నిర్లక్ష్యం, -కుట్ర బట్టయలయిందన్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం- 2014 ప్రకారం ఎన్‌టిపిసి ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల ప్లాంట్లు రాష్ట్రానికి రావాల్సి ఉండగా, బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేవలం 1600 మెగావాట్లకు మాత్రమే ఒప్పందం చేసుకొని, మిగతా 2400 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్రానికి రాకుండా అడ్డుకుందని మంత్రి ఆరోపించారు. దామరచర్లలో తమ సొంత ప్లాంట్లకు లాభం చేకూర్చేందుకు ఎన్‌టిపిసి ప్లాంట్ ఆలస్యానికి కారణమైందని, అప్పుడే ఒప్పందం చేసుంటే ఇప్పుడు 2400 మెగావాట్ల విద్యుత్తు రాష్ట్రానికి అందుబాటులో ఉండేదని మంత్రి తెలిపారు. యాదాద్రి-, భద్రాద్రి విద్యుత్ నిర్మాణాల్లో జరిగిన అవినీతి పై ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్‌తో న్యాయ విచారణ చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఏ రోజైనా అవినీతి బయటపడుతుందనే భయం బిఆర్‌ఎస్ నేతల్లో కనిపిస్తోందని, అందుకే హరీశ్ రావు ఏదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అన్ని నిబంధనలకు తిలోదకాలిచ్చి భద్రాద్రి, -యాదాద్రి ప్లాంట్లు ప్రారంభించి వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు.
కాంపిటేటివ్ బిడ్డింగ్‌లో ఫెయిల్ అయిన కంపెనీకి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చి, యూనిట్ విద్యుత్ రేటును తొమ్మిది రూపాయల వరకు పెంచారని, బొగ్గు-నీటి వనరులు లేని ప్రాంతంలో యాదాద్రి ప్లాంట్ నిర్మించి అవివేక నిర్ణయాలతో భారీ నష్టం కలిగించారని మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు. సిటికి మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ జోన్‌లో పరిశ్రమల భూములను కన్వర్షన్ చేసుకునేందుకు ప్రభుత్వం జీఓ ఇవ్వకముందే రూ. 5 లక్షల కుంభకోణమని ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కెటిఆర్ కంటే నేనేం తక్కువా అన్నట్లు హరీష్ రావు రూ.50 వేల కోట్ల కుంభకోణం అని మరో అబద్ధం ఎత్తుకున్నాడని మండిపడ్డారు. కెటిఆర్, హరీష్‌రావు ప్రవర్తన చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.