హైదరాబాద్: నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూల్ చేసి ఓ ఐటి కంపెనీ బోర్డుతిప్పేసింది. ఈ ఘరానా మోసం నగరంలోని మాదాపూర్లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శిక్షణ ఇచ్చి, ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ నిరుద్యోగులను నమ్మించి భారీగా డబ్బులు వసూల్ చేసింది. దాదాపు 400 మంది విద్యార్థుల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.3 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేసిన కంపెనీ తర్వాత బోర్డు తిప్పేసింది. మొత్తం డబ్బును తీసుకుని కంపెనీ డైరెక్టర్ స్వామి నాయుడు పరారయ్యాడు. దీంతో బాధిత విద్యార్థులు సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారైన స్వామి నాయుడును పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.