గౌహతి: సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. సొంత గడ్డపై స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ఇలాంటి చేదు ఫలితాన్ని చవిచూడడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రధాన కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ల వల్లే భారత్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందని వారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీనియర్లతో పాటు ప్రతిభావంతులైన క్రికెటర్లపై గంభీర్, అగార్కర్‌లు చిన్నచూపు చూడడం వల్లే టెస్టుల్లో టీమిండియా ఆట తీరు రోజురోజుకు తీసికట్టుగా మారుతుందని వారు వాపోయారు. ఇప్పటికైనా బిసిసిఐ ఈ విషయంలో స్పందించి అగార్కర్, గంభీర్‌లను పదవుల నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.