హైదరాబాద్: బిజెపి ఎంపి సిఎం రమేశ్‌కు మాతృవియోగం కలిగింది. సిఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ(83) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున 3:39 గంటలకు అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా రత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిఎం రమేష్ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. తన కుటుంబానికి వెన్నెముక, తన జీవితానికి వెలుగుగా నిలిచిన మా అమ్మ ఇక లేరనే నిజాన్ని అంగీకరించడం చాలా భారంగా ఉందని ట్విట్టర్ లో సిఎం రమేష్ పోస్టు చేశారు. తన తల్లి ప్రేమ, త్యాగం, ఆప్యాయత అనేవి మాటలతో చెప్పలేనంత గొప్పగా ఉన్నాయన్నారు. మా నవ్వుల్లో తన ఆనందాన్ని చూసుకునేదని గుర్తు చేశారు. మా కష్టాల్లో మా కన్నా ఎక్కువగా కలవరపడే ఆమెనేనని, ఎప్పుడూ తాము ముందుకెళ్లాలని, మంచి చేయాలని కోరుకున్నది కూడా ఆమెనని తెలిపారు. తన చిన్న విజయం నుండి పెద్ద విజయాల వరక అమ్మే మొదటగా పండుగలా జరుపుకునేదని, తాను నిలబడిన ప్రతి అడుగులో ఆమె ఆశీస్సులు, నమ్మకం, ప్రేమే తనకు బలం ఉందన్నారు. ఇప్పుడు ఆమె లేకపోవడంతో మాటల్లో చెప్పలేనంత పెద్ద లోటు ఉందని, ఇంట్లో, మనసులో, జీవితంలో ఒక ఖాళీగా మారిపోయిందన్నారు. ‘అమ్మా… మీరు మాకు నేర్పిన విలువలు, అందించిన ప్రేమ, చూపించిన బాట ఇవి మా జీవితాంతం నడిపించే శక్తి అని, మీరు లేకపోయినా, మీ స్మృతులు, మీ మాటలు, ఆశీస్సులు ప్రతి రోజూ మాతోనే ఉంటాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు మా జీవితంలో ఎప్పటికీ విడదీయలేని ప్రేమగా, వెలుగుగా నిలిచిపోతారు’ అని రమేష్ పేర్కొన్నారు. ఆమె మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుబూతి ప్రకటించారు.