పాల్గొననున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ
తెలుగు సహా 9 భాషల రాజ్యాంగ అనువాద సంపుటాల ఆవిష్కరణ
2015 నుంచి ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం
న్యూఢిల్లీ : భారత రాజ్యాంగం ఆమోదించిన 76వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నాడు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహణకు ఘనంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఉభయసభల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన రాజ్యాంగ సభ వార్షికోత్సవాలు సాగుతాయి. భారత రాజ్యాంగాన్ని తాజాగా తొమ్మిది భాషలలో అనువదించారు. ఈ సందర్భంగా, తెలుగు, మలయాళం, మరాఠీ, పంజాబీ, ఒడిశా, కశ్మీరీ, అస్సామీ, నేపాలి, బోడో అనువాద సంపుటాల ఆవిష్కరణ జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో భారత్ కే సంవిధాన్ మై కాలా ఔర్ కాలిగ్రఫీ అనే స్మారక బుక్ లెట్ ను కూడా విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలు కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తాయి. సామాన్యులు రాజ్యాంగ ప్రవేశికను చదివేందుకు ఆన్ లైన్ లో ఏర్పాట్లు చేశారు. అలాగే సోషల్ మీడియాలో దీనిని ఏర్పాటు చేశారు. హమారా సంవిధాన్ – హమారా స్వాభిమాన్ పై జాతీయ ఆన్ లైన్ క్విజ్ లు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు.
సామాన్య పౌరులు ఈ పోటీలలో పాల్గొనే అవకాశం ఉంది. భారత రాజ్యంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది.దీని జ్ఞాపకార్థం 2015 నుంచి ప్రతిఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు, రాజ్యాంగం లోని కొన్ని నిబంధనలు వెంటనే అమలులోకి వస్తే, 1950 జనవరి 26న అధికారికంగా రాజ్యాంగం అమలులోకివచ్చింది. భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిష్కృతమైంది.