దేశ చరిత్రలోనే అతి పెద్ద భూ కుంభకోణం రాష్ట్రంలో జరిగిందని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ హిల్ట్ భూ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు ఇవేనని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన అనుచరులతో ఈ కుంభకోణానికి పథకం వేశారని ఆయన ఆరోపించారు. 22వ తేదీన జివో నెంబర్ 27 తీసుకుని వచ్చి 9292 ఎకరాలకు సంబంధించి 22 ఎస్టేట్‌లను మల్టీ జోన్స్‌గా మార్చేందుకు ఈ పథకం వేశారని ఆయన ఆరోపించారు. కేవలం ఎస్‌ఆర్‌వో వాల్యులో ముప్పై శాతానికే అప్పజెప్పి రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆస్తి విలువ సుమారు ఆరున్నర లక్షల కోట్లపైనే ఉంటుందని, దీంతో రాష్ట్ర అప్పును కూడా తీర్చేయవచ్చని అన్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కొల్లగొడుతూ క్లిప్టొక్రిసి పాలన కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. సామాన్యులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గతంలో పారిశ్రామిక వాడలుగా గుర్తించిన ఈ భూములను, అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల గల వేల ఎకరాల భూములకు ప్రభుత్వం లూఠీ చేసే ఆలోచనలో ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.హిల్ట్ పాలసీ సిఎం రేవంత్ రెడ్డికి లంకె బిందెల్లా దొరికాయని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ముందుగానే తన అనుచరులను అక్కడి ఇరవై రెండు ఎస్టేట్లకు పంపించి అక్కడి కంపెనీలతో పథకం ప్రకారం ఒప్పందం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ విధానంతో రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుందో ముఖ్యమంత్రి వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరున్నర లక్షల ముప్పై వేల కోట్లను రాష్ట్ర ఖజానాకు తరలిస్తే, రాష్ట్ర అప్పు తీర్చవచ్చని లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాలకైనా వినియోగించవచ్చని ఆయన తెలిపారు.
కేవలం తన స్వార్థం కోసం, దేశంలో రిచ్చెస్ట్ పొలిటీషీయన్ కావాలనే కాంక్షతో ఈ కుంభకోణానికి తెర లేపారని ఆయన దుయ్యబట్టారు. ఇటీవల ఒఆర్‌ఆర్ పరిథిలో కోకాపేటలో ఎకరాకు నూట ముప్పైఏడు కోట్ల రూపాయలు వేలం పలికిందన్నారు. ఈ లెక్కన సగానికి అనుకున్నా అరవై ఎనిమిది కోట్ల చొప్పున లెక్క వేసినా అరున్నర లక్షల కోట్ల రూపాయలు అవుతుందన్నారు. కనీసం టిజిఐఐసి రేట్‌ను కూడా లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎస్‌ఆర్‌వో వాల్యూలో ముప్పై శాతానికి చ్చి, వారికి సకల మర్యాదలు చేసి రాష్ట్ర ఖజానాకు గండి పడే విధంగా ఈ జివో ఎందుకు తీసుకుని వచ్చారో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అనేక సార్లు రాష్ట్ర అప్పు గురించి చెబుతున్న ముఖ్యమంత్రికి ఈ ఆస్తితో రాష్ట్రాన్ని గాడిలో పెట్టవచ్చని తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై తమ పార్టీ ప్రజా ఉద్యమం చేస్తుందని, ప్రజా క్షేత్రంలో దోషులను నిలబెడుతుందని ఆయన హెచ్చరించారు.