సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్‌లో 549 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించలేక 140 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్థానం మరింత దిగజారింది. రెండో టెస్ట్‌కి ముందు నాలుగో స్థానంలో ఉన్న టీం ఇండియా.. రెండో టెస్ట్ ఓటమి తర్వాత ఐదో స్థానానికి (48.15 శాతం) పడిపోయింది. ఈ డబ్ల్యూటిసిలో ఇప్పటివరకూ 9 మ్యాచ్‌లు ఆడిన ఇండియా కేవలం 4 మ్యాచుల్లోనే విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచుల్లో ఓడిపోగా.. ఒక టెస్ట్ డ్రాగా ముగిసింది.
ఇక టెస్ట్ సిరీస్ విజయంతో సౌతాఫ్రికా గెలుపు శాతం 66.67 నుంచి 75.00కు పెరిగింది. కానీ, రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఆడిన నాలుగు మ్యాచుల్లో గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక (66.67 శాతంతో) మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ (50.00 శాతంతో)తో నాలుగో స్థానంలో.. భారత్ తర్వాత ఇంగ్లండ్ (36.11 శాతంతో) నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ (16.67) ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లో ఓడిన వెస్టిండీస్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ డబ్ల్యూటిసిలో న్యూజిలాండ్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.