తను పనిచేస్తున్న యజమాని ఇంట్లోనే దోపిడి చేసేందుకు వాచ్‌మెన్, మరో ఐదుగురితో కలిసి ప్రయత్నించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సమయానికి జూబ్లీహిల్స్ పోలీసులు చేరుకొని నిందితులను పట్టకోవడంతో ఇంటి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..జూబ్లీహిల్స్‌లో నివసించే అజయ్ అగర్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇంటికి వాచ్‌మెన్‌గా రాధాచంద్ చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. అగర్వాల్ ఇంట్లో బంగారం, నగదు భారీ ఉంటుందని భావించిన రాధాచంద్ తనకు స్నేహితులతో కలిసి దోపిడికి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి ఆరుగురు కత్తులు,
తాళ్లతో అగర్వాల్ ఇంటికి వచ్చి ఇంటి ఆవరణలోని గదిలో నిద్రిస్తున్న డ్రైవర్ దయాచంద్‌ను తాళ్లతో కట్టివేస్తుండగా ప్రతిఘటించాడు. దీంతో ఆగ్రహం చెందిన నిందితులు దయాచంద్‌పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. తర్వాత తాళ్లతో దయాచంద్‌ను కట్టివేసి అజయ్ అగర్వాల్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు అప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేగంగా స్పందించిన పోలీసులు అగర్వాల్ ఇంటికి చేరుకుని దోపిడికి యత్నిస్తున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన దయాచంద్‌ను ఆస్పత్రికి తరలించారు. దోపిడికి యత్నించి నిందితులను పోలీసులు విచారణ చేస్తున్నారు.