న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీలో రూ.2500 కోట్ల విలువైన 82 కిలోల హైగ్రేడ్ కొకైన్‌ను నార్కోటిక్ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ భారీస్మగ్లింగ్‌కు మాస్టర్‌మైండ్ అయిన పవన్ ఠాకూర్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో అతడిని భారత్‌కు అప్పగించనున్నారు. ఢిల్లీకి చెందిన ఈ హవాలా ఏజెంట్ ఈ కొకైన్‌ను ఢిల్లీకి ట్రక్కుద్వారా పంపించేముందు దేశంలోని పోర్టు ద్వారా రవాణా చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఈవారం మొదట్లో ఢిల్లీలో పట్టుబడిన రూ.282 కోట్ల విలువైన మెథాంపెట్‌మిన్ డ్రగ్స్ రవాణాలో కూడా పవన్‌ఠాకూర్ కీలక సూత్రధారిగా తేలిందని దర్యాప్తు అధికారులు తెలియజేశారు.
గత కొన్నేళ్లుగా హవాలా, మనీలాండరింగ్ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఢిల్లీ కుచ మహాజని మార్కెట్‌లో హవాలా ఏజెంట్‌గా పని ప్రారంభించిన ఠాకూర్ క్రమంగా భారీ ఎత్తున మాదకద్రవ్యాల వ్యాపారిగా మారాడు. అక్రమ సంపాదన దాచిపెట్టడానికి తన వాణిజ్య ప్రావీణ్యాన్ని వినియోగించేవాడు. డ్రగ్స్ వ్యాపారంలో వచ్చిన బ్లాక్‌మనీ విస్తారమైన హవాలా నెట్‌వర్క్ ద్వారా మళ్లించేవాడు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా భారత్, చైనా, సింగపూర్, హాంగ్‌కాంగ్, అరబ్ ఎమిరేట్స్ దేశాల సరిహద్దుల్లోని బినామీ కంపెనీలకు ఆ డబ్బంతా చేర్చేవాడు.