రాష్ట్రంలో భూబకాసురుల రాజ్యమేలుతోందని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర సంపదకు కస్టోడియన్‌గా ఆలోచించాలే తప్ప రియల్టర్‌గా ఆలోచించరాదని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో అన్నారు. హిల్ట్ పాలసీ తెచ్చి ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతూ భూముల గజదొంగలా, ల్యాండ్ లూటీ మాఫియా డాన్‌లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇండస్ట్రియల్ ల్యాండ్ చోరీలా ఉన్న హిల్ట్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, జివోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి హిల్ట్ పాలసీపై చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని దేశ ప్రజలు భావిస్తారని ఆయన తెలిపారు. హిల్ట్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే హైదరాబాద్ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అటువంటి ప్రజా ఉద్యమాలకు తమ పార్టీ మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ మాఫియాపై సమగ్ర విచారణ జరిపించి సంబంధించిన వారిని జైలుకు పంపిస్తామని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.