ఎస్‌హెచ్‌జిలకు నేడు వడ్డీలేని రుణాల పంపిణీ
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు
ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలి
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సిఎం భట్టి
సిఎం, డిప్యూటీ సిఎంలకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు
మన తెలంగాణ/హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో రూ.304కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వము జమ చేసింది. మొత్తం 3,57,098 సంఘాలకు ఈ నిధులు చేరాయి. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సిఈఓ దివ్యా దేవరాజన్, జిల్లా డిఆర్‌డిఎ అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా ప ర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరునాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఈ సందర్భంగా మం త్రి స్పష్టం చేశారు. ప్రతి ఏడాది రూ. 25 వేల కోట్లకు తగ్గకుండా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ, వాటికి వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం తరఫునే వడ్డీలను చెల్లించడం కొనసాగుతోందని తెలిపారు.
తాజాగా రూ.304 కోట్ల వడ్డీలను చెల్లించినట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు గ్రామీణ సంఘాలకు రూ.1,118 కోట్ల వడ్డీ రహిత రుణాలు చేరాయన్నారు. ఇవి కాకుండా పట్టణ మహిళా సంఘాలకు సుమారు రూ.300 కోట్ల వడ్డీ లేని రుణాలను చెల్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, ఆడబిడ్డల ఆర్థిక భద్రత కోసం వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తూ, వారి అభివృద్ధికి దారితీసే పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలపై వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వాటిని భరిస్తోందని, మహిళల సాధికారతను శాశ్వతంగా నిలబెట్టే విధానాలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన రూ. 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందని, స్వయం సహాయక మహిళలు కష్టపడి పొదుపుగా పెట్టుకున్న అభయహస్తం నిధులను కూడా కాజేసిందని గుర్తు చేశారు. మహిళల కష్టాన్ని దోచుకున్న బిఆర్‌ఎస్ పెద్దలకు మహిళా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కే లేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు నిధులను పారదర్శకంగా, సకాలంలో అందిస్తూ వారి ఆర్థిక శక్తిని మరింతగా పెంచే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని అన్నారు.