ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై స్థానిక కోర్టులో గృహ హింస కేసు పెట్టింది. తనభర్త నుంచి భౌతికంగా, లైంగికంగా, దూషణల ద్వారా తీవ్ర వేదనకు గురవుతున్నానని ఆమె పిటిషన్‌లో ఆరోపించింది. మంగళవారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్‌సి తాడ్యే ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. దీనిపై హాగ్‌కు నోటీస్ జారీ అయింది. డిసెంబర్ 12న దీనిపై విచారించనున్నారు. కరన్‌జ్వాల అండ్ కంపెనీ న్యాయ సంస్థ ద్వారా ఆమె పిటిషన్ దాఖలు చేశారు. 47 ఏళ్ల సెలీనా జైట్లీ 2010లో పీటర్ హాగ్‌ను ఆస్ట్రియాలో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వివాహం అయిన తరువాత తనను పనిచేయరాదని భర్త ఆంక్షలు విధించినట్టు ఆమె పిటిషన్‌లో ఆరోపించారు.
తన భర్త దురహంకారి, ముక్కోపి, తనకుతాను ఎక్కువని భావించే వ్యక్తి, మద్యపాన బానిసని, ఈ అవలక్షణాలతో నిరంతరం తాను వేదనకు, ఒత్తిడికి గురవుతున్నానని ఆమె పిటిషన్‌లో ఆరోపించారు. భౌతికంగా, దుర్భాషల ద్వారా ఎలా తనను వేధించేవాడో ఆమె కొన్ని సంఘటనలను ఉదహరించారు. హాగ్ కూడా ఆస్ట్రియాలోని కోర్టులో ఈ ఏడాది ఆగస్టులో విడాకులకు దరఖాస్తు చేశాడని పేర్కొన్నారు. తన మాజీ భర్త నుంచి రూ. 50 కోట్లు పరిహారం , నెలనెలా రూ 10 లక్షలు భరణం ఇప్పించాలని ఆమె పిటిషన్‌లో కోరారు. ఆస్ట్రియాలో ప్రస్తుతం హాగ్ దగ్గరే ఉన్న తన ముగ్గురు పిల్లలతో వర్చువల్‌గా నైనా మాట్లాడే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.