బీహార్‌లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రిమండలి కూర్పులో కానీ, మంత్రి పదవుల కేటాయింపులో కానీ జెడి(యు) కన్నా బిజెపి ఆధిపత్యమే స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరువాత రెండోస్థానంలో జెడి(యు) పార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని జెడి(యు) సుప్రీం నితీశ్‌కుమార్ తిరిగి పొందగలిగారు. అయినప్పటికీ తన ఇరవై ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానంలో మొట్టమొదటిసారి ఇప్పుడు హోం శాఖపై తన ఆధిపత్యానికి అవకాశం లేక దూరం కావలసి వచ్చింది. బిజెపికి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన సమ్రాట్ చౌదరి ఇప్పుడు అత్యంత అధికార శక్తియుతమైన హోంశాఖ పగ్గాలు చేపట్టారు. అలాగే బిజెపికి చెందిన మరో ఉపముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా రెవెన్యూ, భూసంస్కరణలు, గనులు, భౌగోళిక విభాగాల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా పాలనా విభాగాలపై బిజెపి నియంత్రణను మరింత బలోపేతం చేసింది. అంటే నితీశ్ కుమార్‌ను ఒక విధంగా బలహీనుడిని చేయడమే. మొత్తం 26 మంత్రి పదవుల్లో 14 బిజెపి పట్టులోనే ఉన్నాయి. ఆరోగ్యం, న్యాయం, రోడ్ల నిర్మాణం, అర్బన్ డెవలప్‌మెంట్, వ్యవసాయం వంటి కీలకమైన శాఖలు బిజెపి నియంత్రణలో ఉండటం విశేషం.
బిజెపి తన మిత్రపక్షం జెడి(యు) సోపానక్రమాన్ని తనకు అనుకూలంగా తారుమారు చేయడంలో అత్యంత సమర్థవంతంగా, చాకచక్యంగా నిర్ణయాత్మకమైన చర్య తీసుకోగలిగింది. 2020 లో బిజెపి పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ నితీశ్‌కుమార్ మంత్రివర్గంలో కీలకమైన శాఖలను తన వద్దనే ఉంచుకోగలిగారు. ఇదివరకటి అసెంబ్లీలో సామాజిక న్యాయం అనే ముఖ్యమైన సూత్రం ప్రకారం జెడి(యు) కు తన మిత్రపక్షం ఆర్‌జెడికి చోటు కల్పించడానికి అవకాశం ఉండేది. అయితే ఈసారి నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ సాధించిన అఖండ విజయం బిజెపిని అగ్రస్థానంలో పటిష్టంగా ఉంచగలగడమే కాక, సాధ్యం కాకపోయినా జెడి(యు) ద్వారా ప్రత్యామ్నాయాల అన్వేషణను కష్టతరం చేసింది. నితీశ్‌కుమార్ అనారోగ్యంతో పోరాటం సాగిస్తున్నారు. అయినా బిజెపికి నితీశ్ తప్పనిసరిగా అనివార్యం అవుతున్నారు. మరోవైపు బిజెపి తన దీర్ఘకాలిక మార్గాన్ని సుస్థిరం చేసే ప్రయత్నంలో ఉంటోంది. సామాజిక వర్గాలకు జెడి(యు) యే తమకు అనుకూల వేదిక అన్న నమ్మకం ఉన్నప్పటికీ ఆయా సామాజిక వర్గాలకు చేరువ కావడానికి బిజెపి విస్తారమైన లోతైన కులాల సంకీర్ణాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తోంది.
లాలూప్రసాద్ యాదవ్‌కు ఒకనాటి అత్యంత విధేయుడైన రామ్‌కృపాల్ యాదవ్‌ను బిజెపి ఇప్పుడు అక్కున చేర్చుకుని యాదవ సామాజిక వర్గానికి కూడా బిజెపిలో చోటు ఉందన్న సంకేతాలను అందించింది. సామాజిక వర్గాలను బుజ్జగించడం, పరిపాలనా యుక్తి, తదితర వ్యూహాలతో బీహార్ రాజకీయాల్లో బిజెపి తనకు తాను కేంద్ర స్థానంగా నిలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రాష్ట్రంలోని 21 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేలా మొత్తం రూ. 2100 కోట్లు బదిలీ చేశారు. ఇది ప్రతి మహిళా ఓటరుకు రూ. 10 వేలు వంతున ఆర్థిక సాయం చేయడమే . అందుకే ఎన్‌డిఎ కూటమి విజయంలో మహిళలే కీలక పాత్రదారులయ్యారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి ఊరించే పథకాలతో అభివృద్ధి జరగదు. ఇప్పుడు ముందున్న అసలైన సవాలు చక్కని పరిపాలన.ఇదివరకటి తమ పరిపాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం, ఆదరణ ఉన్నందునే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలిగామని బిజెపి వాదించవచ్చు.
కానీ బీహార్ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందన్నది వాస్తవం. బీహార్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నితీశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదెంతవరకు సాధ్యమో ఇప్పుడు ఆలోచించవలసి ఉంది. గత రెండేళ్లుగా ప్రభుత్వ విభాగాల్లో రిక్రూట్‌మెంట్ జరగడం లేదు. ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో పేపర్‌లీక్, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి, నోటిఫికేషన్ల జారీలో విపరీత జాప్యం ఇవన్నీ గత కొన్నేళ్లుగా వెంటాడుతున్నాయి. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం బీహార్‌లో 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగ రేటు 20.1 శాతం ఉండగా, అదే వయసువారిలో జాతీయ నిరుద్యోగ సరాసరి రేటు 12.4 శాతం వరకు ఉంది. దీన్ని బట్టి బీహార్‌లో నిరుద్యోగం ఎలా తాండవిస్తుందో ఊహించాల్సిందే. కార్మిక భాగస్వామ్యం, వాస్తవానికి పనిచేస్తున్న లేదా పనికోసం నిరీక్షిస్తున్న వ్యక్తుల నిష్పత్తి దేశం మొత్తం మీద అత్యల్పంగా ఉంది.
15 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న యువత వంద మందిలో కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మహిళల విషయానికి వస్తే ఆ సంఖ్య ఇంకా తక్కువ. ఉద్యోగాలు, ఉపాధి కరువై లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసపోవడం సర్వసాధారణం. అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కొని బీహార్ రాష్ట్రాన్ని ఎలా ముందుకు ప్రగతి పథంలో కొత్త మంత్రి మండలి తీసుకెళ్తుందో ఒక అగ్నిపరీక్ష. దేశ జనాభాలో పదోవంతు జనాభా బీహార్ రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రపురోగతి సానుకూలంగా యావత్ దేశాన్నే ప్రభావితం చేస్తుంది. ఇప్పటివరకు పాలనలో లోపాలు కనిపిస్తున్నా అవన్నీ నిజాయితీగా సరిదిద్ది చక్కని పాలన అందిస్తారని ఓటర్లు ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎన్‌డిఎ కూటమికి పట్టం కట్టారు. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పాలన వల్లనే ప్రగతి సాధ్యం అనే నినాదం పదేపదే వల్లెస్తోంది. మరి ఈసారి అదెంతవరకు ఆచరణలో నెరవేరుతుందో చూడాలి.