ముంబై: సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో.. స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. వివాహం అనుకున్న రోజు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో వివాహాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే తండ్రి చూడని పెళ్లి తనకు వద్దని స్మృతి ఈ వివాహాన్ని వాయిదా వేసినట్లు ఆమె మేనేజర్ తెలిపారు. మరోవైపు పలాశ్ కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. వరుస మ్యూజిక్ కాన్సర్టులు, పెెళ్లి సెలబ్రేషన్స్ కారణంగా వైరల్ ఇన్‌ఫెక్షన్, ఎసిడిటితో అతను ఆస్పత్రి పాలయ్యాడు.
ఈ నేఫథ్యంలో ఇరు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందా అనేలా గాసిప్‌రాయుళ్లు పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే పలాశ్ తల్లి అమిత ఈ పుకర్లపై స్పందించారు. తమ రెండు కుటుంబాలకు ఎటువంటి విబేధాలు కలగలేదని ఆమె స్పష్టం చేశారు. నిజానికి పెళ్లిని వాయిదా వేసింది తన కుమారుడే అని తెలిపారు. ‘‘స్మృతి తండ్రి అంటే పలాష్‌కు ఎంతో ఇష్టం. స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరే పలాష్‌కు సాన్నిహిత్యం ఎక్కువ. ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే.. స్మృతి కంటే ముందు పలాష్ స్పందించాడు. తనే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. స్మృతి తండ్రి కోలుకునేంత వరకు వివాహ వేడుకను వాయిదా వేయాలని చెప్పాడు’’ అని పేర్కొన్నారు.