మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ మంగళవారం జరుగనుంది. సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్‌లో సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. అయితే, ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లు, అలాగే డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల వేడుకలు, శాఖల వారీగా పనితీరు, సమీక్ష, విద్యుత్ పంపిణీ సంస్థల బలోపేతం, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు కెటిఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.