నారాయణ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్): ఛత్తీస్‌గఢ్ లోని నారాయణ్‌పూర్ జిల్లాలో మంగళవారం 28 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో 22 మందిపై మొత్తం రూ.89 లక్షల వరకు రివార్డు ప్రకటించి ఉంది. వీరిలో 19 మంది మహిళా నక్సల్స్ ఉన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న ‘ నియాద్ నల్లనార్ ’( మీ మంచి గ్రామం) పథకం, లొంగిపోయిన వారికి కొత్తగా కల్పించే పునరావాస విధానం, పూనామార్ఘం (సామాజిక పునరేకీకరణకోసం పునరావాసం)తదితర కార్యక్రమాలకు ప్రభావితులై స్వయంగా వారంతట వారే లొంగిపోయారని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి) బస్తర్ రేంజి సుందర్‌రాజ్ పట్టిలింగం వెల్లడించారు.
లొంగిపోయిన వారిలో పండి ధ్రువ్ అలియాస్ దినేష్ (33), డివిజనల్ కమిటీ సభ్యుడు, దూలె మండవి అలియాస్ మున్ని (26) ఛత్తిస్ పోయం (18), పడ్నిఒయాం (30).ఈ ముగ్గురు మావోయిస్టుల తూర్పు బస్తర్ డివిజన్ మిలిటరీ కంపెనీ నెం.6 కు చెందినవారు. వీరి ఒక్కొక్కరి తలపై రూ. 8 లక్షల వంతున నగదు రివార్డు ఉంది. మిగతా వారిలో ఏరియా కమిటీ మెంబర్లు లక్షు యుసెండి (20), సుక్మటి నురేటి (25), సకిలా కాశ్యప్ (35), షాంబట్టి షోరి (35), చైతే అలియాస్ రజిత (30), బుద్ర రవా (28),వీరి ఒక్కొక్కరి తలపై రూ.5 లక్షల వంతున నగదు రివార్డు ఉంది. దినేష్, లక్షు, సుక్‌మత్రి ఒక సెల్ఫ్‌లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, ఒక303 రైఫిల్‌ను అప్పగించారని ఐజిపి చెప్పారు. ఈ 28 మావోయిస్టులకు పునరావాసం కల్పించడంతో హింస, ప్రజావ్యతిరేక మావోయిస్ట్ భావజాలం దాదాపు అంతమైనట్టే అని భావించవచ్చని ఐజిపి పట్టిలింగం పేర్కొన్నారు.
గత 50 రోజుల్లో ప్రధాన స్రవంతి లోకి 512 మంది మావోయిస్టులు
నారాయణ్‌పూర్‌తో సహా మొత్తం ఏడు జిల్లాల నుంచి గత 50 రోజుల్లో దాదాపు 512 మంది మావోయిస్టులు హింసామార్గాన్ని విడిచిపెట్టి ప్రధాన స్రవంతి లోకి చేరారని ఐజిపి చెప్పారు. నారాయణ్‌పూర్ జిల్లాలో ఈఏడాది ఇంతవరకు 287 మంది మావోయిజ భావజాలానికి స్వస్తి చెప్పి లొంగిపోయారని నారాయణ్‌పూర్ జిల్లా ఎస్‌పి రాబిన్‌సన్ గురియా చెప్పారు. మిగతా సీనియర్ మావోయిస్టు కేడర్ రామ్‌దార్, పాపారావు, బర్సెదేవ, తదితరులకు హింసను విడిచిపెట్ట ప్రధాన స్రవంతిలో చేరడం తప్ప వేరే గత్యంతరం లేదని పేర్కొన్నారు. గత 23 నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 2200 మంది నక్సల్స్ లొంగిపోయారని పోలీసులు వెల్లడించారు.