ఆరేళ్ల క్రితం కేంద్రంలో గృహ వ్యవహారాల మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని ఆయన నోట దృఢంగా వినిపిస్తూ వస్తోంది. ఉట్టి మాటగా కాకుండా దానికి తగిన కార్యాచరణను కూడా ఆయన రచిస్తూ వచ్చారు. ప్రభావిత రాష్ట్రాల పోలీసులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఫలితాలను డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల లెక్కలు, వాటి పెరుగుదల తప్ప మరో మాట ఆయన వినదలుచుకోలేదు. లొంగిపోవాలని ఏడాది నుండి పోలీసులు మైకులు పెట్టి చెప్పినా మావోయిస్టులు మాత్రం యథావిధిగా పోలీసులతో తలపడడానికే సిద్ధపడ్డారు. పెరిగిన బలగాలను ఎదుర్కొనే క్రమంలో చాలామంది పోలీసు తూటాలకు బలి అయ్యారు. చివరకు వారు దిగివచ్చి శాంతిచర్చలు జరపాలని కోరినా అలాంటి ప్రసక్తే లేదని ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. మే నెలలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌తో యుద్ధం ఏకపక్షమైంది. ఆ తర్వాత మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటు పార్టీపై భారీ ప్రభావాన్ని చూపింది. ప్రాణభయంతో లొంగిపోతున్న వారికి క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టకుండా సామాజిక జీవనం గడిపేందుకు వీలు కల్పిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. పట్టుబడినవారిని జైలుకు పంపుతున్నందువల్ల లొంగిపోవడమే ఉత్తమ మార్గమమైంది.
అయితే ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ క్షమాభిక్ష రూల్ మడావి హిడ్మాకి మాత్రం దక్కలేదు. మావోయిస్టుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ముద్ర పడిన హిడ్మాను ప్రాణాలతో వదిలేందుకు ప్రభుత్వం, పోలీసులు సిద్ధంగా లేరనే విషయం ఆయన ఎన్‌కౌంటర్ తర్వాత అర్థమవుతోంది. హిడ్మా విషయంలో మాత్రం కంటికి కన్ను అనే సిద్ధాంతాన్నే పోలీసులు అనుసరించారు. సర్కారు దృష్టిలో హిడ్మా మావోయిస్టు అనే పదానికే పర్యాయంగా కనబడ్డాడు. ఎందరో పోలీసు జవాన్ల మరణాల ధ్వంస రచనకు మూలమని భావిస్తున్న హిడ్మాపై భద్రతా దళాల కోపం సహజంగానే తారస్థాయిలో ఉంటుంది. హిడ్మాలో కొందరు వీరుణ్ణి చూస్తే ప్రభుత్వం మాత్రం ఆయన్ని ఓ క్రూరుడిగా భావించింది. అందుకే ఆయన్ని ఓ సెపరేట్ టార్గెట్‌గా పరిగణించారు. ఎంతకూ ఆచూకీ దొరకని హిడ్మాను దారిలోకి తెచ్చుకోవడానికి ఆయన తల్లిని వాడుకున్నారు. తనను వదిలి పెట్టరు అని తెలిసి మొండిగా అడవిలో తప్పించుకుంటున్న హిడ్మా మనసు మెత్తపడేలా ఆయన తల్లితో కొడుకు గురించి మాట్లాడించారు. మనమంతా ఒక్కటే అనే భావన కలిగేలా చత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ వారి గ్రామానికి వెళ్లి హిడ్మా తల్లితో కలిసి పక్కన కూచొని భోజనం చేశాడు. దగ్గరి బంధువులా చేతులు కలిపి, దండం పెట్టి నమ్మకాన్ని పెంచాడు. ఈ సంఘటన వల్ల తల్లితో ఊర్లో అందరితో కల్సి బతకాలనే ఆశ హిడ్మా మనసులో కలగవచ్చు.
హిడ్మా లొంగిపోవాలనుకొని అనుకున్నాక దానికి సరియైన మార్గం కోసం ప్రయత్నించినట్లు కథనాలు ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలోనే తెలంగాణలో పోలీసుల ముందుకు రావాలనుకున్నాడు కానీ ప్రభుత్వం సహకరించలేదని ఒక వాదన ఉంది. అయితే ఆ సంప్రదింపుల మూలంగా మధ్యవర్తి ద్వారా హిడ్మా దళం కదలికలు కొందరు అధికారుల దాకా చేరాయి. కేసుల ఎత్తివేత, పునరావాసానికి ఎపిలోని కూటమి ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని ఆయన్ని ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి వచ్చేలా చేశారు. ఆ విషయం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు సమాచారం వెళ్ళింది. బతుకుమీద తీపి హిడ్మాను దుర్బలుణ్ణి చేసింది. లొంగుబాటు అవకాశాన్ని పూర్తిగా నమ్మి వేరే దళంలో ఉన్న తన భార్య రాజేను కూడా రప్పించుకొని అందరూ కలిసి మారేడుమిల్లి చేరుకున్నారు. పొంచి ఉన్న పోలీసులు దాడి చేసి అందరిని ఎన్‌కౌంటర్ చేశారని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది అనే విషయాన్ని ఎవరు వివరించడం లేదు.
తనకు ఎదురైన పోలీసులపై హిడ్మా దళం ఆయుధాలతో తలపడినట్లు ఆధారాలేవీ లేవు. లొంగిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నవాడు యుద్ధానికి తలపడే అవకాశమే లేదు. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. చికిత్స కోసం విజయవాడలోని హాస్పిటల్‌కు వచ్చిన ఆయన్ని పట్టుకెళ్లి కాల్చి చంపారని పార్టీ ప్రకటించింది. ఇప్పుడు పార్టీ పూర్తిగా బలహీనపడింది. లొంగుబాట్లు జరుగుతున్నా ఎన్‌కౌంటర్లు ఆగడం లేదు. ఎవరికి ప్రాణభిక్ష పెట్టాలి, ఎవరిని మట్టుపెట్టాలి అనే నిర్ణయాధికారం పూర్తిగా పోలీసుల చేతుల్లోకిపోయింది. కొందరు నాయక స్థాయి వ్యక్తులు పోలీసుల అధీనంలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. వారి లొంగుబాటు ప్రక్రియను ఎప్పుడు, ఎలా చేపట్టాలో పోలీసులే నిర్ణయిస్తారని అంటున్నారు. లొంగుబాటుకు సిద్ధపడ్డవాళ్లను కాల్చేస్తే ప్రభుత్వం మాటపై విశ్వాసం పోతుంది. మావోయిస్టులు పోలీసులపై కాల్పులకు పాల్పడుతున్న ఘటనలేవీ వార్తల్లోకి రాలేదు. ఎన్‌కౌంటర్లలో పోలీసు జవాన్లు గాయపడిన సందర్భాలు కూడా లేవు. మావోయిస్టులపై పైచేయి సాధించిన పోలీసులు ఈ కీలక సమయంలో కాల్పులను పూర్తిగా ఆపివేయాలి. అడవి బాట వీడాలనుకున్నవారికి ప్రాణభిక్షయే ప్రభుత్వ ధర్మం.
– బి.నర్సన్, 9440128169