న్యూఢిల్లీ :ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి తిరస్కరించినందుకు తనను విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ మాజీ క్రిస్టియన్ ఆర్మీ అధికారి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఇది అత్యంత దారుణమైన క్రమశిక్షణారాహిత్యంగా వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ జాయ్‌మాల్యలతో కూడిన ధర్మాసనం ఆర్మీ చర్యలను సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మాజీ క్రిస్టియన్ ఆర్మీ అధికారి శామ్యూల్ కమలేశన్ సైనిక క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారని సుప్రీం పేర్కొంది. ఆయన ఎలాంటి సందేశం పంపుతున్నారు? ఇది పూర్తిగా క్రమశిక్షణ రాహిత్యం.ఒకసారి ఆర్మీ యూనిఫాం ధరించాక వ్యక్తిగత అభిప్రాయాలు,విశ్వాసాలకు అవకాశం ఉండకూడదు. ఆ సైనికాధికారి అత్యుత్తమంగా విధులు నిర్వర్తించే వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించే స్వభావం ఆర్మీకి సరిపోదు అని కోర్టు పేర్కొంది. కమలేశన్ తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపిస్తూ ఒకే ఒక్క ఉల్లంఘనకే ఆయనను విధుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. హోళీ, దీపావళి వంటి పండగల్లో పాల్గొని ఇతర మతాల వ్యక్తులతో గౌరవంగా వ్యవహరిస్తుంటారని వాదించారు. పంజాబ్ లోని మమున్‌లో గురుద్వారా,ఆలయం మాత్రమే ఉన్నాయని, అధికారులు ఇచ్చిన ఆదేశాల్లో గర్భగుడి లోకి ప్రవేశించడానికి మాత్రమే ఆయన నిరాకరించారని చెప్పారు. ఈ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు.