గందరగోళానికి తెరదించండి
ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటా
అధిష్టానానికి కర్నాటక సిఎం సిద్ధరామయ్య స్పష్టీకరణ
అది నలుగురి మధ్య జరిగిన రహస్య ఒప్పందం
పార్టీని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు: డికె శివకుమార్
బహిరంగంగా చర్చించబోం: ఖర్గే
బెంగళూరు/కనకపుర/న్యూఢిల్లీ: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం రసకందాయానికి చేరుకుంటోంది. ఇప్పటి వరకు ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటిస్తూ వచ్చిన సిఎం సిద్ధరామయ్య స్వరంలో మార్పులు వస్తున్నాయి. కొద్ది రోజులుగా ప్రభుత్వంలో, పార్టీలో ఈ అంశంపై సాగుతున్న గందరగోళానికి హైకమాండ్ తెరదించాలని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని మంగళవారంనాడు మీడియాతో వ్యాఖ్యానించారు. శాసనసభ్యులకు ఢిల్లీ వెళ్లే స్వేచ్ఛ ఉందని, వారి అభిప్రాయాన్ని హైకమాండ్‌కు చెప్పుకోవచ్చని అన్నారు. మరికొన్ని నెలల్లో అనూహ్య పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని కేంద్రమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందన వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు.
అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా తాను, శివకుమార్ అలాగే చేయాలని పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి మార్పు అంశంపై బహిరంగంగా చర్చించడం తనకిష్టం లేదని, ఇది పార్టీలోని మా నలుగురైదుగురు మధ్య జరిగిన రహస్య ఒప్పందమని, తాను తనమనస్సాక్షిని నమ్ముతానని కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ మంగళవారం వెల్లడించారు. పార్టీని ఇబ్బంది పెట్టి , బలహీనపర్చడం తనకిష్టం లేదని వ్యాఖ్యానించారు. మంగళవారం ఖర్గే ఢిల్లీకి బయలుదేరుతుండగా ఆయనతోపాటు డికె విమానాశ్రయానికి వెళ్లడం గమనార్హం. ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ఫైనల్ అవుతుందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు శివకుమార్ బదులిస్తూ“ నన్ను ముఖ్యమంత్రిని చేయమని నేను అడగలేదు. ఇది ఐదుగురు ఆరుగురు మధ్య ఉన్న రహస్య ఒప్పందం. మనం మనస్సాక్షి ప్రకారం పనిచేయాలి” అని సమాధానం ఇచ్చారు.
స్వంత నియోజకవర్గం కనకపురలో విలేకరులతో మాట్లాడుతూ..“ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన సీనియర్ నాయకులు. ఆయన పార్టీకి గొప్ప ఆస్తి. ముఖ్యమంత్రిగా ఏడున్నర ఏళ్లు పూర్తి చేశారు. (ఇదివరకు 2013 నుంచి 2018 వరకు సిద్ధరామయ్య సిఎంగా పనిచేశారు)” అని డికె వెల్లడించారు. మరోవైపు కర్నాటక పరిణామాలపై బహిరంగంగా చర్చించబోమని ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తాను రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చానని అన్నారు.