మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జిఒ 46 ప్రకారం 50 శాతానికి లోబడి రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్ల కేటాయించడంతో పాటు లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.
ఎస్‌సి, ఎస్‌టిల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22 శాతం మాత్రమే బిసి రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో కొన్ని చోట్ల బిసిల రిజర్వు స్థానాలు మారాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్‌లను రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలను సమర్పించినట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.