చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
కీలక విషయాలు రాబట్టిన పోలీసులు
టెలీగ్రాంలో సినిమాల కొనుగోలు.. క్రిప్టోలో లావాదేవీలు
మనతెలంగాణ, సిటిబ్యూరోః పైరసీ సినిమాల కేసులో అరెస్టు అయిన ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి కస్టడీ ముగియడంతో పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టు రవిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వడంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేశారు. దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. రవి ఒక్కడే సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐదేళ్ల నుంచి సినిమాలను ఐ బొమ్మ వెబ్‌సైట్ ద్వారా పైరసీ చేస్తున్న రవి బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్, మ్యాట్రీమోని వెబ్‌సైట్లను ప్రమోట్ చేయడం ద్వారా రూ.100కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. వాటికి సంబంధించిన రూ.30కోట్ల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.
ఐడిఎఫ్‌సి బ్యాంక్ ద్వారా ఇతర బ్యాంక్ ఖాతాలకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించారు. లావాదేవీలను రవి క్రిప్టో కరెన్సీలో నిర్వహించినట్లు గుర్తించారు. ఐ బొమ్మను ఒకసారి క్లిక్ చేస్తే 15 ప్రకటనలు వచ్చే విధంగా డిజైన్ చేశారు, ఇందులో మ్యాట్రిమోనీ, గేమింగ్, బెట్టింగ్ యాప్‌లు ఓపెన్ అయ్యే విధంగా చేశాడు. తన వెబ్‌సైట్‌కు 50లక్షల వ్యూవర్ షిప్ ఉందని చెప్పి వ్యాపారం చేసినట్లు తెలిసింది. దానిని చూసిన బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులు ప్రకటనలు ఇవ్వడంతో భారీగా డబ్బులు సంపాందించాడు. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేయగా ఒక కేసులోనే రిమాండ్ చేశారని, బేయిల్ పిటీషన్ వేశామని రవి లాయర్ తెలిపారు. తన సోదరి, స్నేహితుడు నిఖిల్ గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు రవిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటీషన్ వేయనున్నట్లు తెలిసింది.
టెలీగ్రాంలో కొనుగోలు…
రవి కొత్త సినిమాలను టెలీగ్రాంలో బేరాలు ఆడి కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. కొనుగోలు చేసిన సినిమాలను హెచ్‌డి క్వాలిటీలోకి మార్చి ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవాడు. వెబ్‌సైట్‌లో పలు ప్రకటనలను ప్రమోట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించాడు.