చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంకాసి జిల్లాలో సోమవారం రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురై నుంచి సెన్‌కొట్టాయ్ వైపు వెళ్తున్న బస్సు.. టెంకాసి నుంచి కొవిల్‌పట్టికి వెళ్తున్న బస్సు బలంగా ఢీకొన్నాయి. మధురై నుంచి సెన్‌కొట్టాయ్ వైపు వెళ్తున్న కేసర్ బస్సు డ్రైవర్ అతి వేగంతో నిర్లక్ష్యంగా బస్సు నడపడం వళ్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన 28 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తూ, ప్రత్యేక్ష సాక్షులను విచారిస్తున్నారు.