మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 14 కొత్త ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం 14 ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లకు సంబంధించి రంగారెడ్డిలో తొమ్మిది, హైదరాబాద్‌లో మూడు, సంగారెడ్డిలో 1, వరంగల్ జిల్లాల్లో ఒక్కో ఎక్సైజ్ స్టేషన్‌లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్‌లోని మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లలో బంజారాహిల్స్ ఎక్సైజ్ స్టేషన్‌ను జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ప్రారంభించగా, చిక్కడపల్లి ఎక్సైజ్ స్టేషన్‌ను జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్ సుప్రియలు, మారేడుపల్లి ఎక్సైజ్ స్టేషన్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, ఈఎస్ పంచాక్షరీ, ఏఈఎస్ శ్రీనివాసరావులతో పాటు మూడు స్టేషన్ల సిఐలు బానోతు పటేల్, రామకృష్ణ, జగన్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. శంషాబాద్ ఈఎస్ పరిధిలోని గండిపేట్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌ను ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్, కొండపూర్ స్టేషన్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ కృష్ణప్రియ ఇతర అధికారులు పాల్గొన్నారు. సరూర్‌నగర్ ఈఎస్ పరిధిలోని మీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌ను రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, పెద్ద అంబర్‌పేట్ స్టేషన్ ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డిలు ప్రారంభించారు. మేడ్చల్ ఈఎస్ పరిధిలోని కొంపల్లి, కూకట్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌లను ఎక్సైజ్ సూపరింటెండ్ ఫయాజుద్దీన్, ఏఈఎస్ మాధవయ్యలు ప్రారంభించారు.
మల్కాజిగిరి ఈఎస్ పరిధిలో కాప్రా పోలీస్‌స్టేషన్‌ను ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, నాచారం స్టేషన్‌ను ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు, అల్వాల్ స్టేషన్‌ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు ప్రారంభించగా ఈఎస్ నవీన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్‌లోని అమీన్‌పూర్ ఎక్సైజ్ స్టేషన్‌ను ఎంపి రఘునందన్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో మెదక్ డిప్యూటీ కమిషనర్ జె. హరికిషన్, ఏఈఎస్ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. హసన్‌పర్తి స్టేషన్‌ను వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో డిసి అంజన్‌రావు, ఈఎస్ చంద్రశేఖర్లు పాల్గొన్నారు.