మనతెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి అందజేసిన వెంటనే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై ప్రభు త్వం సమగ్ర మార్గదర్శకాలతో శనివారం జిఒ 46ను ప్రభుత్వం విడుదల చేసి, ఈ రిజర్వేషన్ల జాబితాను జిల్లాల కలెక్టర్లకు పంపించింది. జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో అధికారులు ఆదివారం సాయంత్రం కల్లా పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియను దాదాపు పూర్తి చేశారు. జిఒ 46 మార్గదర్శకాల ప్రకారం జిల్లాల్లో కలెక్టర్లు పంచాయతీల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లను సోమవారం పంచాయతీరాజ్ శాఖకు అందజేయనున్నారు. సోమవారం(నవంబర్ 24) హైకోర్టులో రిజర్వేషన్ల అమలుపై విచారణ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఖరారైన రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించనున్నట్లు తెలిసింది. పంచాయతీల్లో 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు అమలు చేస్తే ఎన్నికలు నిర్వహించుకునేందుకు గతంలో హైకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంగళవారం(నవంబర్ 25) కేబినెట్ సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఆదేశాలు, ఇతర అంశాలను ఆమోదించనున్నట్లు సమాచారం. అనంతరం ఈనెల 26న పంచాయతీ ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్‌ఇసి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదివారం(నవంబర్ 23) గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం.. ఓటర్ల జాబితాను పరిశీలించి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మళ్లీ ప్రచురించారు. ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన నేపథ్యంలో ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల షెడ్యూ ల్ విడుదలయ్యే అవకాశముంది. 31 జిల్లాల్లో 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించి, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా.. గత సెప్టెంబర్ 2న వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు.
గ్రామాల్లో ఊపందుకున్న రాజకీయం
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి.. ఎన్నికల రంగంలోకి దూకేందుకు స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నా రు. జిల్లాల్లో ఆదివారమే రిజర్వేషన్లు ఖరారైన నేపత్యంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఔత్సాహికులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.దాంతో గ్రామాల్లో మళ్లీ రాజకీయం ఊపందుకుంది. గత కొంతకాలంగా ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో నాయకులు, యువకులు చొరవ చూ పారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో గ్రా మాల్లో ఎవరు పోటీలో ఉంటారో దాదాపుగా ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఈనేపథ్యంలో గ్రామంలో ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆయా పార్టీల్లోని నా యకులు, కార్యకర్తలు, ఏ పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా ఆ యా పార్టీల మద్దతు కూడగట్టి పోటీచేయాలనే ఆసక్తితో ఉన్నారు.
ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పార్టీలు
పంచాయతీ ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఆయా రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. జిల్లాలవారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా తమ కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ఆయా పార్టీల నేతలు ప్రణాళికలు సిద్దం చే సుకుంటున్నారు. వీటితోపాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.