విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండాను ఎగరేసేందుకు, ఏళ్ల నాటి మన స్మృతులను మళ్ళీ మీటేందుకు సిద్ధమయ్యారు రమణ గోగుల మెల్‌బోర్న్. మామా క్రియేటివ్ స్పేస్, టాప్ నాచ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్ట్రేలియా సంయుక్తంగా ‘ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ – రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్ ఫిబ్రవరి 2026’ పేరిట ఒక భారీ సంగీత యాత్రను ప్రకటించాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో రమణ గోగులతో పాటు, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ కట్టాల, మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ ఈ వరల్డ్ టూర్ వివరాలను వెల్లడించారు. రమణ గోగుల తన సంగీత ప్రస్థానంలో తొలిసారిగా పూర్తి స్థాయి గ్లోబల్ కాన్సర్ట్ టూర్ చేపడుతుండటం తెలుగు సంగీత చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని వారు అభిప్రాయ పడ్డారు.
ఈ టూర్ కేవలం సంగీత కచేరీలకు మాత్రమే పరిమితం కాదు. రమణ గోగుల ఐకానిక్ పాటలు, వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలు, తెర వెనక ఉన్న కథలతో కూడిన ఒక భావోద్వేగభరితమైన అన్వేషణ అని వారు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఒక వినూత్నమైన ‘డాక్యు-మ్యూజికల్ సిరీస్’ను రూపొందిస్తోంది. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ మాట్లాడుతూ.. ‘రమణ గోగుల గతంలో ఎప్పుడూ ఇలాంటి కాన్సర్ట్స్ చేయలేదు. ఇది కేవలం ఒక టూర్ కాదు, ఇదొక భావోద్వేగాల ఉద్యమం. హృదయాన్ని టచ్ చేసే సంభాషణల సమాహారం. ‘ట్రావెలింగ్ సోల్జర్’ తొలిసారిగా ప్రపంచ వేదికపైకి అడుగుపెడుతున్నారు. ఖండాంతరాల్లో ఉన్న మ్యూజిక్ లవర్స్ రమణ గోగుల కళను, కథను వింటూ అనుభూతి చెందాలని మేము కోరుకుంటున్నాము’ అని అన్నారు.