కొలంబో: కొద్ది రోజుల క్రితమే భారత మహిళలు ఐసిసి వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. నేవి ముంబై వేదికగా సౌతాఫ్రికా మహిళలతో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఇదిలా ఉండగానే భారత మహిళలు మరో ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సారి అంధుల టోర్నమెంట్‌లో. భారత అంధ మహిళల క్రికెట్ జట్టు తొలి టి-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.
తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంకతో పాటు యుఎఇ కూడా పాల్గొన్నాయి. అయితే నేపాల్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. పూలా సరెన్ (44) అద్భుతంగా రాణించింది. దీంతో తొలి ఎడిషన్‌లోనే టి-20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకొని భారత్ అంధ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో జట్టుపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.