మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం శరవేగంగా అ డుగులు వేస్తోంది. దీనిలో భాగంగా పంచాయతీ ల్లో వార్డులు, సర్పంచ్ పదవులకు రిజర్వేషన్ల కేటాయింపునకు సంబంధించి విధివిధానాలను ఖరా రు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కా గా రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుం డా, కుల గణన, 2011 జనాభా లెక్కల ఆధారం గా రిజర్వేషన్లు ఎలా నిర్ణయించాలో వెల్లడిస్తూ ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జివో నెం.46 విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు విడుదలతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పూర్తికావడంతో ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలే మిగిలింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, సర్పంచ్‌లకు సంబంధించిన రిజర్వేషన్లను నిర్ణయించిన తర్వాత నివేదికను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ మూడు రోజుల్లో ప్రభుత్వం పూర్తి చేస్తే, ఎన్నికల సంఘం ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇవీ మార్గదర్శకాలు..
గ్రామ పంచాయతీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సమగ్ర మార్గదర్శకాలు ఇలా ఉ న్నాయి. సుప్రీంకోర్టు నిబంధనలను అనుసరించి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలని, సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్య సర్వే(ఎస్‌ఇఇపిసి)ఆధారంగా రిజర్వేషన్ కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.కులగణన ఆధారంగా వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించాలని, కులగణన ఆధారంగా బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం పేర్కొంది. సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లను సంబంధిత ఆర్టీవోల స్థాయిలో ఖరారు చేయాలని, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఆయా ఎంపీడీవోలు నిర్ణయించాలని స్పష్టం చేసింది.
ఇక మహిళా రిజర్వేషన్ల విషయానికొస్తే రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు నిర్ధారించాలని పేర్కొంది. వంద శాతం జనాభా ఉన్న ఎస్‌టి గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలను ఎస్‌టిలకు మాత్రమే రిజర్వ్ చేసి ఉంటాయని వెల్లడించింది. కిందటిసారి ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు, గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయకూడదని పేర్కొంది. 2019 ఎన్నికల్లో అమలు కాని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగవచ్చని తెలిపింది. రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేసింది. ఎస్‌టి రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి ఆ తర్వాత ఎస్‌సి, బిసిలకు కేటాయించాలని వెల్లడించింది.
రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అథారిటీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ ద్వారా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది. రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాస్తుందని, అదే విధంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు, ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన విచారణను కూడా ముగించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించే అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాల తర్వాత అదే రోజు లేదా తర్వాత రోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధంగా ఉందని సమాచారం.