అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలన్న కల నెరవేరలేదన్న తీవ్ర మనస్తాపంతో గుంటూరుకు చెందిన యువ వైద్యురాలు డాక్టర్ రోహిణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే డాక్టర్ రోహిణి గత ఏడాది కాలంగా అమెరికాలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పిజి) చేసేందుకు జే1 వీసా కోసం ప్రయత్నిస్తున్నారు.
అయితే, ఇటీవల ఆమె వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో తన భవిష్యత్ ఆశలు అడియాసలయ్యాయని భావించిన ఆమె, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీసా రాకపోవడం వల్లే రోహిణి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వస్థలమైన గుంటూరుకు తరలించారు.