కానిస్టేబుల్ సహా ముగ్గురు అరెస్టు – రూ.5.76 కోట్లు స్వాధీనం
మన తెలంగాణ/హైదరాబాద్ : బెంగళూరులో పట్టపగలే జరిగిన ఎటిఎం వాహనంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ఓ కానిస్టేబు ల్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.5.76 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా మొత్తాన్ని సైతం స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. మొత్తం 30 మందిని విచారణ చేసిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. చోరీ కోసం నిందితులు 3 నెలలు పాటు ప్రణాళిక వేసుకున్నారన్నారు. గత 15 రోజుల నుంచి దోపీడీ చేయాల్సిన ప్రదేశంపై నిఘా ఉంచారని తెలిపారు. ఈ నెల 19 మధ్యాహ్నం 12.48 గంటల సమయంలో అశోక్ పిల్లర్-జయనగర్ దారి సర్కిల్ మార్గంలో నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న కారుతో వచ్చి, కస్టోడియన్ వాహనాన్ని అడ్డగించారన్నారు. తమను తాము ఆర్‌బిఐ కంట్రోల్ ఆఫీసర్లమని చెప్పుకున్నారని తెలిపారు. నిందితులు సదరు కస్టోడియన్ వాహనంలోకి ఎక్కి, డ్రైవర్‌ను డైరీ సర్కిల్ వైపు వెళ్లమని సూచించారన్నారు. తరువాత సెక్యూరిటీ గార్డు, కస్డోడియన్ సిబ్బంది వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను తీసుకుని బయటపడేశారని తెలిపారు. వారు ఎవరికీ దొరకకూడదనే ఉద్దేశంతో సిసిటివిలు లేని ప్రదేశాన్ని ఎంచు కున్నారన్నారు. ఈ దోపిడి గురించి తెలియగానే పోలీసులు బెంగళూరు సరిహద్దు జిల్లాల ఎస్‌పిలు, పొరుగు రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. అదనంగా బెంగళూరు పోలీసు శాఖలోని ఇద్దరు జాయింట్ కమిషనర్ల మార్గదర్శకత్వంలో ఇద్దరు డిసిపిలు సుమారు 200 మంది అధికారులు సిబ్బందితో కూడిన 11 బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లాయన్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వారిలో సిఎంఎస్ సెక్యూరిటీస్ కస్టోడియన్ వెహికల్ సూపర్‌వైజర్ రవి, మాజీ ఉద్యోగి జేవియర్, గోవింద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ అన్నప్ప నాయక్ ఉన్నారన్నారు. వారి నుంచి రూ.5.76 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు నమోదైన 54 గంటల్లోనే ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. అయితే ఈ దోపిడీలో కనీసం 6 నుంచి 8 పాల్గొన్నట్లు సమాచారం. అందుకే మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ – సీమంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అయితే త్వరితగతిన ఈ కేసులోని ముగ్గురు కీలక నిందితులను పట్టుకున్న బృందానికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే, వాస్తవానికి ఎటిఎంలో డబ్బులు వేసేందుకు వెళ్లే వాహనంలో డ్రైవర్‌తోపాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉండాలి. అలాగే ఇద్దరు కస్టోడియన్లు కచ్చితంగా ఉండి తీరాలి. కస్టోడియన్ వాహనాన్ని ఒకే సమయంలో, ఒకే మార్గంలో పదేపదే తీసుకెళ్ల కూడదు. సిబ్బందికి కచ్చితంగా డబ్బు నిర్వహణలో శిక్షణ ఇచ్చి ఉండాలి. సిబ్బంది బ్యాక్ గ్రౌండ్ కూడా కచ్చితంగా చెక్ చేయాలి. కస్టోడియన్ కంపెనీలోని ఏ ఉద్యోగిని తొలగించినా, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. కానీ తాజా కేసులో సిఎంఎస్ సెక్యూరిటీస్ కంపెనీలో చాలా లొసుగులు ఉన్నాయని తేలింది. కనుక దీని గురించి ఆర్‌బిఐకు లేఖ రాస్తామని వివరించారు.