భారతదేశం ప్రపంచదేశాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. మన దేశం వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక సదుపాయాల రంగాలలో విశేష ప్రగతి సాధిస్తోంది. వీటితోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మన దేశం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2047 నాటికి భారతదేశం స్వాతంత్య్రం పొంది 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా అన్ని రంగాలో సమగ్రమైన అభివృద్ధి చెంది వికసిత భారత్ ( డెవలప్‌డ్ ఇండియా) గా మారడం మన ప్రధాన జాతీయ లక్ష్యం. ఇందుకు యువశక్తి , నారీశక్తి, పేదరికం, రైతులు అను నాలుగు అంశాలు ప్రధాన స్తంభాలు. ప్రకృతిని కాపాడటం, ప్రగతిని సాధించడం అనే రెండు దిశలను కలిపే భావనను వికసిత భారత్ అంటారు. భారత దేశాన్ని ప్రపంచంలో మొదటి మూడు అగ్ర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుపటం, సేవా రంగం, వ్యవసాయ రంగాలలో సమానపురోగతి సాధించడం, పేదరిక నిర్మూలన మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, డిజిటల్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగాలలో ప్రపంచ నాయకత్వం సాధించడం, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్- ఇండియా ద్వారా యువతకు ఆవిష్కరణలలో అవకాశం కల్పించడం, రోడ్లు, రైల్వేలు, మెట్రో నగరాలు, గృహ నిర్మాణం, విమానాశ్రయాలు వంటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయటం, నూతన విద్యా విధానం- 2020 ద్వారా సృజనాత్మక ఆవిష్కరణాత్మక, నైపుణ్యవంతమైన యువతను తయారు చేయడం , ఆరోగ్య భద్రత కల్పించడం, గ్రీన్ ఎనర్జి వినియోగం, చెట్ల పెంపు, నీటి సంరక్షణ, గాలి కాలుష్యం నియంత్రణ, వాతావరణ మార్పులకు ప్రతిస్పందించేపద్ధతులు అను అంశాలు వికసిత భారత్‌కు ప్రధాన స్తంభాలుగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు అమలవుతున్న వనమహోత్సవం స్వచ్ఛదనం, -పచ్చదనం ఎకోటూరిజం, పర్యావరణ నిధి నిర్వహణ, గ్రీన్ స్కిల్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, శుద్ధ సౌరశక్తి పథకం, క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, బయో డైవర్శిటీ రిజిస్టర్ , సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ పథకం, క్లైమేట్ చేంజ్ సెల్, తెలంగాణ నెట్ జీరో మిషన్, గ్రీన్ బిల్డింగ్ పథకం, లేక్ రీజునివేషన్ పథకాలు పర్యావరణ వికసిత భారత్‌కు ఆలంబనగా ఉన్నాయి. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ భవనాలు, పరిశ్రమలు కాదు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, పచ్చని ప్రకృతి, జీవవైవిధ్య, రక్షణ, పునరుత్పత్తి శక్తి వినియోగం కూడా అందులో భాగమేనని, ఈ తాత్విక చింతనతోనే మన దేశం పర్యావరణ వికసిత భారతం వైపు అడుగులు వేస్తోంది.
పచ్చని పర్యావరణం దిశగా భారత్
మన దేశానికి స్వాతంత్య్రం లభించి 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తి అయింది. 2022 నుండి 2047 మధ్య కాలాన్ని కేంద్ర ప్రభుత్వం అమృత కాలంగా ప్రకటించింది. ఈ కాలంలో మన దేశం వికసిత భారత్‌గా మారడానికి అనేక పథకాలు, కార్యక్రమాలు, సదస్సుల నిర్వహణ ద్వారా లక్ష్యసాధనలో దూసుకపోతోంది. తాజాగా నీతిఆయోగ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2025 న న్యూఢిల్లీలో 22 జులై 2025న గాంధీనగర్‌లో, 17 అక్టోబర్ 2025న న్యూఢిల్లీలో వికసిత భారత్‌పై జాతీయ సదస్సులు జరిగాయి. 19 మార్చి 2025న న్యూఢిల్లీలో వాతావరణ సంక్షోభంపై జరిగిన జాతీయ సదస్సులో పర్యావరణ అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరిగింది. స్వయం సమృద్ధ దేశం వైపు దేశీయ ఉత్పత్తి పెంపు కోసం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన దేశం కోసం స్వచ్ఛభారత్ అభియాన్, ప్రతి ఇంటికి తాగునీరు, నీటి వనరుల సంరక్షణ కోసం జలజీవన్ మిషన్, రవాణా, విద్యుత్, వాణిజ్యం వంటి రంగాలను ఒకే ప్లాట్ ఫారంలో అనుసంధానించడం కోసం పిఎం గతిశక్తి, రైతుల ఆదాయం పెంపు, పంటల రక్షణ, నీటి వినియోగ సామర్థ్యం పెంపుదల కోసం పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజన, 2030 నాటికి మొత్తం విద్యుత్‌లో 50 శాతం పునరుత్పత్తికి సౌర, జల, వాయు, బయోమాస్ వంటి క్లీన్ ఎనర్జీ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ- మొబిలిటీ మిషన్, ఎలక్ట్రికల్ కార్లు, బస్సులు చార్జింగ్ స్టేషన్లకు ప్రోత్సహించేందుకు ఫేమ్ ఇండియా పథకం, 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమలులో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్‌లను నిర్వహిస్తోంది.
2070 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కోసం నెట్ జీరో కార్బన్ ఎమిషన్ సాధనకు కట్టుబడి ఉండటం, నగరాల్లో వాయు కాలుష్యం తగ్గింపునకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలు పర్యావరణ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఇంధన రంగంలో హరిత ఇంధన వినియోగానికై గ్రీన్ హైడ్రోజన్ మిషన్, భూగర్భ జలాల రీచార్జింగ్ కోసం అటల్ భూజల్ యోజన, సాంప్రదాయ చెరువులు, కుంటల పునరుద్ధరణ కోసం మిషన్ అమృత్ సరోవర్, ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానల్‌ల ఏర్పాటు కోసం పిఎం సూర్యఘర్, ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ ఏర్పాటు, 2030 నాటికి 500 గిగా వాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యంగా నేషనల్ సోలార్ మిషన్, పర్యావరణ సేవల ఫలితాల నమోదుకు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం, వ్యర్థాలను విద్యుత్ ఎరువుల రూపంలో ఉపయోగించేందుకు వ్యర్థాల నుండి శక్తి(వెస్ట్ టు ఎనర్జీ) ప్రాజెక్టుల రూపకల్పన, పర్యావరణ స్నేహపూర్వక పట్టణాల అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీస్ మిషన్, హరిత పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు, పెట్టుబడులు, పర్యావరణ అనుకూల సాంకేతికతల వినియోగం కోసం గ్రీన్ టెక్నాలజీ పథకం, దేశంలో అడవుల విస్తరణ, పచ్చదనం పెంపుల కోసం గ్రీన్ ఇండియా మిషన్, సేంద్రియ వ్యవసాయం సహజ వ్యవసాయ విధానాల ప్రోత్సాహం, మట్టి నాణ్యత పునరుద్ధరణకు సాయిల్ హెల్త్ కార్డ్ పథకం, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు నిమిత్తం పిఎం ప్రాణం పథకం, ప్రజలు, యువత, విద్యార్థులలో పర్యావరణ చైతన్యం పెంచడం, పర్యావరణ అనుకూల జీవన విధానంను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రపంచ స్థాయి పర్యావరణ ప్రవర్తనా, పరివర్తనోద్యమం మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్) వంటి అంశాలు పర్యావరణ వికసిత భారత్ లక్ష్యసాధనకు మైలు రాళ్ళుగా ఉన్నాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జి -20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో భారత్ ఇచ్చిన వన్‌ఎర్త్ వన్ ఫ్యామిలి వన్ ఫ్యూచర్ నినాదం ప్రపంచ పర్యావరణ ఐక్యతకు, ప్రజల భాగస్వామ్యానికి సంకేతంగా నిలుస్తున్నది.
అవశ్యమైన ప్రజల భాగస్వామ్యం
వికసిత భారత్ అనేది కేవలం ప్రభుత్వ ప్రణాళిక కాదు, ఇది భారత ప్రజల సంయుక్త సంకల్పం. మన భవిష్యత్తు తరాల కోసం చేసిన వాగ్దానం. దీనిని 2047 నాటికి సాకారం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రణాళికలు; పథకాలు అమలు పరిచినా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఫలితం ఉండదు. కనుక పన్నులు చెల్లించడం, సేవా భావంతో పనిచేయడం, విద్య, ఆరోగ్యం, శుభ్రత, హరిత వాతావరణం పట్ల బాధ్యతాయుతమైన భాగస్వామ్యం కలిగి ఉండటం ప్రజల ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. ఏక్ పేడ్ మా కే నామ్ లో తల్లి పేరుతో ఒక వ్యక్తి -ఒక చెట్టు నాటడం, నీటి, ఆహార వృథాను అరికట్టడం, ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం తగ్గించడం, సౌర విద్యుత్ వాడకం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం, త్రీ అర్స్ సూత్రాన్ని పాటించడం వంటి పర్యావరణ క్రమశిక్షణ గల చర్యలను ప్రతి పౌరుడు పాటించాలి.
వికసిత్ భారత్ లక్ష్యంగా నూతన కల్పనలు, సృజనాత్మకత సమస్య పరిష్కార సామర్థ్యాలను, పర్యావరణ అవగాహనను పెంపొందించేందుకు ఉద్దేశించబడిన ఇన్స్‌ఫైర్, బాలల విజ్ఞాన ప్రదర్శిని, విజ్ఞాన్ మంతన్, ఎకోక్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ , స్టెమ్ ప్రోగ్రాం వికసిత్ భారత్ బిల్ద్ ధాన్- 2025 కార్యక్రమాలలో విద్యార్థులు విరివిగా పాల్గొనాలి. గ్రామం నుండి దేశస్థాయి వరకు ప్రజలందరిలో పర్యావరణ అనుకూల ప్రవర్తన పెంపొందే కార్యక్రమాలు చేపట్టాలి. పాఠశాల స్థాయి నుండి పర్యావరణ విద్యను తప్పనిసరి చేయాలి. స్వాతంత్య్ర సమరయోధులు స్వేచ్ఛ కోసం పోరాడినట్లే మనం సుస్థిర పర్యావరణ అభివృద్ధి కోసం కృషి చేయాలి. అప్పుడే మన దేశం సాంస్కృతిక , విద్య, సాంకేతిక, పర్యావరణ సమతుల్య అభివృద్ధికి ప్రతీకగా ఉంటుంది. అభివృద్ధి, సాంకేతిక పురోగతికి ప్రజల భాగస్వామ్యం కలిస్తే మన దేశం ప్రపంచంలో పర్యావరణ వికసిత భారత్‌గా నిలుస్తుంది.
భారత రవీందర్ 99125 36316