అమెరికా అధ్యక్షపీఠాన్ని రెండవసారి అధిరోహించడానికి ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకువచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ ఉద్యమాన్ని నడపలేని నిస్సహాయతకు చేరుకోవడం తీవ్రమైన పరిణామం. అదే ఇప్పుడు ట్రంప్‌ను అల్లాడిస్తోంది. ఒకప్పుడు ‘వాషింగ్టన్ ఎస్టాబ్లిష్‌మెంట్’ను తీవ్రంగా ట్రంప్ విమర్శించేవారు. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ట్రంప్ మాజీ అనుచరులే ప్రతినిధులయ్యారు. ఫెడరల్ ప్రభుత్వ విభాగాలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, కాంగ్రెస్ అధ్యక్ష భవనం, అత్యున్నత న్యాయస్థానం, తదితర అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నీ వాషింగ్టన్ ఎస్టాబ్లిష్‌మెంట్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ట్రంప్‌ను వ్యతిరేకించే మాజీ అనుచరులే ప్రతినిధులుగా ఉంటున్నారు. ట్రంప్‌ను ప్రశ్నించడమే కాక, ఆయనకు వ్యతిరేకంగా వెనక్కు నెట్టడానికి ‘మాగా’ ఛాంపియన్లు ప్రగతిశీల ప్రజాస్వామ్యవాదులతో కలిసి ఉమ్మడి వేదికను వెతుకుతున్నారు. లైంగిక అక్రమ రవాణాదారునిగా సంచలనం కలిగించిన జెఫ్రీఎపిస్టెయిన్ కేసులో పూర్తి పారదర్శకత కోసం మంగళవారం (18.11.25) నాడు రిపబ్లికన్లు, డెమొక్రాటిక్ సభ్యులు ఏకమై తమ నాయకత్వాలపై ఒత్తిడి తీసుకురావడం ఊహించని పరిణామం. జెఫ్రీఎపిస్టెయిన్ 2019లో కస్టడీలో ఉంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.
జెఫ్రీఎపిస్టెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోసహా అనేక ప్రముఖ అగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎపిస్టెయిన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను విడుదల చేయించడంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లు, సెనేట్ ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఈ దర్యాప్తు ఫైళ్లను విడుదల చేయడానికి ఒకప్పుడు ట్రంప్ ఇష్టపడలేదు. కానీ నవంబర్ 17న వెనక్కు తిరిగి చూసి ఈ ఫైళ్లను దాచడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించడమే కాక, ఈ బిల్లుకు ఓటు వేయాలని బహిరంగంగా రిపబ్లికన్లకు పిలుపు ఇచ్చారు. ఇదివరకు రిపబ్లికన్లు ఈ విషయంలో మాగాకు వ్యతిరేకంగా ట్రంప్‌పై సవాలు విసిరారు. కానీ దానికి ఎక్కువగానే మూల్యం వారు చెల్లించుకోవలసి వచ్చింది. 2021 జనవరి 6 న అమెరికా పార్లమెంట్ భవనంపై దాడి జరిగిన తరువాత ట్రంప్‌పై అభిశంసనానికి ఓటు వేసిన కనీసం నలుగురు రిపబ్లికన్ చట్టసభ్యులు వారి ప్రాథమిక ఎన్నికల్లో మాగా మద్దతు ఉన్న అభ్యర్థుల చేతిలో ఓడిపోవలసి వచ్చింది. మాగా తరఫున వీటో అధికారం కలిగిన ట్రంప్ ఆగ్రహం నుంచి కొంతమంది రిపబ్లికన్లు బయటపడగలిగారు. ఇప్పుడు ట్రంప్‌కు కొత్త సవాలు ఎదురవుతోంది. తాను సృష్టించి పెంచి పోషించిన రాజకీయ ప్రపంచమే తనకు దూరమైపోతోంది.
వాషింగ్టన్ ఎస్టాబ్లిష్‌మెంట్ లోని ప్రముఖ సంస్థల పదవులు, సంప్రదాయ రిపబ్లికన్లతో మమేకమవుతున్నాయని ఘోషిస్తున్నారు. అయితే దీన్ని నిరూపించడానికి ఆయనకు దక్షిణ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహంతో ఉన్న అనుబంధం తప్ప మరే ఆధారాలు లేవు. గ్రాహం 2026లో మళ్లీ ఎన్నికను ఎదుర్కోనున్నారు. 2016లో ట్రంప్‌కు బద్ధవిరోధిగా ఉండే గ్రాహం తరువాత ట్రంప్‌కు సన్నిహితుడైనా, మాగా అభ్యర్థి నుంచి ప్రాథమిక ఎన్నికల్లో సవాలు ఎదుర్కోబోతున్నారు. కానీ దేశంలో ప్రజాస్వామ్య తిరుగుబాటు వేగం పుంజుకుంటున్నందున ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. జార్జియాకు చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు మేర్జోరీ టైలర్ గ్రీన్ ఎపిస్టెయిన్ ఫైళ్ల విషయంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలిచారు. ఆమె మొదట్లో మాగా చాంపియన్‌గా ఉండేవారు. ట్రంప్ ఇప్పుడు ఆమెను దేశద్రోహి అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రిపబ్లికను థామస్, డెమొక్రాట్ రో ఖన్నాతో కలిసి కాంగ్రెస్ తరఫున ఆందోళన లేవనెత్తుతున్నారు. ఇటీవల అనేక పాలనా విధాన నిర్ణయాల్లో ట్రంప్ వైఖరి మారడం కూడా మాగా గ్రూపులో వ్యతిరేకత పెంచింది. హెచ్1 బి వీసా కార్యక్రమంపై అనేక ఆంక్షలు విధించిన ట్రంప్ ఇప్పుడు అమెరికాకు అత్యంత ముఖ్యమని ప్లేటు ఫిరాయించారు. చిప్స్, క్షిపణులు వంటి కీలకమైనవి తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన విదేశీయులకు తాను స్వాగతం పలుకుతానని ప్రకటించారు.
అమెరికాలో భారీ సంఖ్యలో ప్లాంట్లను నిర్మించనున్నామని, అందులో టెలిఫోన్లు, కంప్యూటర్లు, క్షిపణులు వంటివి తయారు చేస్తామని, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరైతే పంచుకుంటారో, ఎవరు ఈ నైపుణ్యాలను అమెరికన్లకు నేర్పిస్తారో వారికి స్వాగతిస్తామని నవంబర్ 20న ట్రంప్ వెల్లడించారు. ఇది మాగా సభ్యులకు అర్థం కావడం లేదని ఆక్షేపించారు. ఈ వైఖరి మాగా గ్రూపు వారికి అసంతృప్తి కలిగిస్తోంది. అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని ప్రకటనలు గుప్పించి, ప్రచారోద్యమం ద్వారా రెండోసారి పదవి లోకి వచ్చిన ట్రంప్ తమ వైఖరిని పూర్తిగా మార్చడం మాగా సభ్యులకు మింగుడుపడడం లేదు. దీనివల్ల మాగా ఉద్యమానికి ప్రాధాన్యం లేకుండా పోతుందని ఆగ్రహిస్తున్నారు. అమెరికాలో ఈ హెచ్ 1బి వీసా కార్యక్రమాన్ని నిరోధించే చట్టం తీసుకురావాలని రిపబ్లికన్ కాంగ్రెస్ నాయకురాలు గ్రీన్ తోపాటు మరికొందరు రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గాజాపై ఇజ్రాయెల్ దారుణంగా సాగిస్తున్న యుద్ధాన్ని నివారించకుండా ఇజ్రాయెల్‌కు ట్రంప్ బహిరంగంగా మద్దతు ఇవ్వడాన్ని కూడా కొందరు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ట్రంప్‌కు అండదండలు అందించిన మాగా శిబిరం హెచ్1 బి వీసాలపైనే కాకుండా ఇజ్రాయెల్ యుద్ధంపై కూడా తిరుగుబాటు సాగిస్తోంది. లైంగిక రవాణాదారుడైన ఎపిస్టెయిన్ ఫైళ్ల దర్యాప్తు విషయంలో ట్రంప్ తలవంచినప్పటికీ, హెచ్1బి వీసాలు, ఇజ్రాయెల్ యుద్ధం సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చూడాలి