హైదరాబాద్: కీలకమైన భూములపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల బడ్జెట్‌కు సరిపడా నిధులు వచ్చే అంశంపై కనీస చర్చ జరగలేదని మండిపడ్డారు. మంత్రి మండలి, అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని.. రూ.5 లక్షల కోట్లు వచ్చే భూములకు కేవలం రూ.5 వేల కోట్లు ఎలా వస్తాయని? ప్రశ్నించారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూములను ఆగమేఘాల మీద ఎలా అప్పగిస్తారని అన్నారు.
రెండు నెలల్లోనే ప్రక్రియ అంతా పూర్తి చేయటం వెనుక కుట్ర ఏమిటని? ఆరోపించారు. భూములను బహిరంగ మార్కెట్‌లో వేలం వేస్తే.. రూ.5 లక్షల కోట్లు వస్తాయని అన్నారు. ప్రభుత్వ అవసరాలకు కూడా లేకుండా భూములను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. కాలుష్యకారక పరిశ్రమలనే ఒఆర్ఆర్ అవతలకు పంపించాలనేది పాలసీ.. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం గ్రీన్ ఇండస్ట్రీలను కూడా బయటికి పంపిస్తోందని ధ్వజమెత్తారు. భారీ భూకుంభకోణంపై కేంద్రంలోని బిజెపి సర్కారు ఎందుకు స్పందించ లేదని.. కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.