జొహనెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో జి 20 సదస్సు ఆరంభంలోనే ప్రధాన డిక్లరేషన్‌ను అసాధారణ రీతిలో ఆమోదించారు. దక్షిణాఫ్రికా ఆతిధ్యంలో తొలిసారిగా ఇక్కడ జి 20 సమ్మిట్ జరుగుతోంది. డిక్లరేషన్ వెలువడకుండా అమెరికా శతవిధాలుగా యత్నించినా , పట్టించుకోకుండా దీనిని ఏకగ్రీవంగా ఆమోదించి, వెలువరించడం కీలక అంశం అయింది. దక్షిణాఫ్రికాలో శక్తివంతమైన జి 20 సదస్సు నిర్వహణపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ నిరసనకు దిగాడు. తాను వెళ్లడం లేదని అలకవహించాడు. ప్రపంచ దేశాల పలువురు నేతలు , ప్రతినిధులు తరలివచ్చిన ఈ సమ్మిట్‌లో డిక్లరేషన్ ఆమోదం అమెరికా వైఖరికి ప్రతిఘటనగా నిలిచింది. సాధారణంగా తీర్మానం లేదా డిక్లరేషన్‌ను సమావేశంలో పలు స్థాయిల్లో జరిగే చర్చలు ఉప చర్చల తరువాత ఆమోదించడం జరుగుతుంది.
కానీ ఈసారి ఇందుకు విరుద్ధంగా దీనిని శనివారం సదస్సుకు ఆరంభం ముందే ఆమోదించడం కీలకం అయింది. పైగా సర్వసమ్మతితోనే దీనిని వెలువరించారు. అమెరికా ప్రాతినిధ్యం లేకుండా జి 20 డిక్లరేషన్ కుదరదనే ట్రంప్ వాదనను జి 20 సదస్సు ఆరంభంలోనే కొట్టిపారేసింది. ఈ డిక్లరేషన్ ఆమోదం అత్యంత కీలకం అని , తమకు ఘననీయమైన క్షణం అని ఆ తరువాత దక్షిణాఫ్రికా అంతర్జాతీయ వ్యవహారాలు , సహకార మంత్రి రోనాల్డ్ లమోలా తెలిపారు. ఇది ఆఫ్రికా ఖండాన్ని విప్లవభరితం చేస్తుందని వ్యాఖ్యానించారు. పైగా డిక్లరేషన్ పూర్తిగా బహుళధృవ అంతర్లీనతను సంతరించుకుందని వివరించారు. ముందుగానే తమ దూతలు పలు దేశాల ప్రతినిధులతో మాట్లాడిన తరువాత డిక్లరేషన్‌కు రంగం సిద్ధం అయిందని తెలిపారు. ఆఫ్రికా ఖండానికి, ప్రపంచానికి అవసరం అయిన పలు కీలక విషయాలు ఈ డిక్లరేషన్‌లో ఉన్నాయని మంత్రి ప్రకటించారు.
నేతలకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా గైర్హాజరీపై, ట్రంప్ విమర్శలపై రోనాల్డ్ తీవ్రంగా స్పందించారు. జి 20 ఓ వేదిక. అమెరికా ప్రాతినిధ్యం ఉన్నా లేకున్నా ఇది కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఆహ్వానితులు రాకపోవడంతో సదస్సు జరగకుండా పోదని, జరిగి తీరుతుందని లమోలా తెలిపారు. ట్రంప్ వైఖరిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు . ఇది బహుళపక్ష వేదిక. ఏ ఒక్కరి కోసం సాగేది కాదు. లేరని ఆగేది కాదని తేల్చిచెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాతి దశ నుంచి కూడా ఈ వేదిక అంతర్జాతీయ విషయాలలో కీలక పాత్ర వహిస్తూ వచ్చింది. అందుకే ఈ డిక్లరేషన్‌ను సగర్వంగా వినూత్నంగా వెలువరించడం జరుగుతోందని తెలిపారు. డిక్లరేషన్ విజయవంతం అయి తీరుతుంది. ప్రపంచం అంతా ఇక్కడనే ఉందని తెలియచేయదల్చుకున్నామని , ప్రస్తుత దశలో అంతర్జాతీయ సహకారం అత్యవసరం , దీనిని మించిన వాదన ఏదీ లేదని దక్షణాఫ్రికా మంత్రి పిలుపు నిచ్చారు.
ట్రంప్ అసత్య ఆరోపణలు.. అమెరికా పట్ల గౌరవం హద్దుల మేరకే
దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులపై సామూహిక హత్యాకాండ జరుగుతోందని ట్రంప్ చేస్తున్న ఆరోపణలను దక్షిణాప్రికా మంత్రి ఖండించారు. అటువంటిదేమీ లేదు. నేరాల ఘటనలు అందరిని ఇబ్బందిపెడుతాయి. తమ సవాళ్లు, సమస్యలు తమకు ఉండనే ఉన్నాయని ఆయన విశ్లేషించారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల గురించి స్పందించారు. అమెరికా అతి పెద్ద ఆర్థిక శక్తి, దక్షిణాఫ్రికాకు రెండో అతి పెద్ద వ్యాపార భాగస్వామ్య పక్షం, అమెరికాతో నిమిత్తం లేకుండా ఆఫ్రికా ముందుకు సాగదు. అయితే దౌత్యపరంగా సముచితంగా ఉంటున్న తమకు వేరే దేశం మితిమీరి వ్యవహరిస్తే ఇంకో విధంగా స్పందించాల్సి ఉంటుందని మంత్రి లమోలా అమెరికాకు చురకలు పెట్టారు. డిక్లరేషన్‌లో పలు కీలక విషయాల ప్రస్తావన జరిగింది. ఇందులో పేద దేశాల రుణాల పరిస్థితి, వడ్డీల భారం వంటివాటి ప్రస్తాన ఉందని తెలిపారు. కొన్ని వివాదాస్పద విషయాలు ఉండనే ఉంటాయి. వీటిని రెండు రోజుల సదస్సులో సంప్రదింపుల్లో చర్చించుకుని, మార్పులు చేర్పులకు దిగవచ్చు అని, ఈ క్రమంలో కొన్ని లాభనష్టాలు ఉండనే ఉంటాయని, ఏకాభిప్రాయం కీలకం అని తేల్చిచెప్పారు.
వర్థమానదేశాలకు ప్రాధాన్యత కీలకం ..జి 20 డిక్లరేషన్
సంక్షుభిత ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో ఎదుగుతున్న దేశాల పట్ల ప్రాధాన్యత అత్యవసరం. దీనినే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి.
వీధి పోరాటాలుగా మారుతున్న పలు అంతర్జాతీయ ప్రాంతీయ ఘర్షణల నివారణకు సత్వర చర్యలు అవసరం .ఇందుకు అంతా పాటుపడాలి.
పేద దేశాలకు రుణాల పరపతి వ్యవస్థ బలోపేతం చేయాలి. వడ్డీ భారం కుదించాల్సి ఉంది. దీనిని స్థిరీకరించాల్సి ఉంది.
ఉక్రెయిన్, ఆక్రమిత పాలస్తీనియా, సూడాన్, కాంగో రిపబ్లిక్ ప్రాంతాలలో శాశ్వత స్థిరమైన శాంతికి అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది.
యాంత్రీకరణ ప్రభావంతో తలెత్తుతున్న కాలుష్యం, వాతావరణ పరిసరాల సమస్యలపై శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంది. గ్లోబల్ వార్మింగ్ పరిణామాలపై మరింత స్పందన అవసరం.
ప్రపంచవ్యాప్తంగా విలువైన అరుదైన ఖనిజాల గనుల నిక్షేపాల పరిరక్షణ, వీటిని కొన్ని దేశాలు తమ వాణిజ్యపరమైన ప్రయోజనాలకు కొల్లగొట్టకుండా చూడాల్సి ఉంది.