భారత్‌లో అధికారికంగా ప్రతి ఏట అత్యధికంగా దాదాపు మూడు వేలకు పైగా పిల్లలు దత్తత ప్రక్రియలో కుటుంబాలను మారడం జరుగుతున్నది. 2024 – 25లో 4,515 మంది, 2023 -24 లో 3,142 మంది పిల్లలు దత్తత ద్వారా మారడం కొనసాగుతున్నది. అధికారికంగా దత్తత తీసుకునే ప్రక్రియ చాలా సంక్లిష్టమైనదిగా, ఎక్కువ కాలం పట్టే ప్రక్రియగా గుర్తించబడింది. పిల్లల్ని దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడం, దత్తత తీసుకున్న కుటుంబాలను గుర్తించి ప్రశంసించడం, ప్రక్రియ పట్ల అవగాహన కలిపించడానికి ప్రతి ఏట 22 నవంబర్ రోజు జాతీయ దత్తత దినోత్సవం (నేషనల్ అడాప్షన్ డే) పాటించడం జరుగుతున్నది. పిల్లలు కాని దంపతులు, ఇతర సందర్భాల్లో శాశ్వతంగా పిల్లలను తన కుటుంబాల్లోకి దత్తత తీసుకోవడం, ఆ కుటుంబాలను ప్రోత్సహించడం, ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం, దత్తత పట్ల అవగాహన కల్పించడం, దత్తతకు సంబంధించిన సంస్థల వివరాలు తెలుసుకోవడం లాంటి అంశాలు ఈ రోజు చర్చించబడతాయి.
2025 జాతీయ దత్తత దినోత్సవం ఇతివృత్తంగా పిల్లల్ని గుర్తించడం : నూతన చిరకాల బంధాలను ఏర్పరచడం అనే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. దత్తత అనేది ఓ అద్భుత ప్రక్రియ. ఇది అనాథల జీవితాల్లో మార్పులను తీసుకు వస్తుంది. దత్తత తీసుకున్న పిల్లల పట్ల ప్రేమను కుమ్మరిస్తూ, మానవత్వానికి మరో నిర్వచనంగా నిలవడం, వారి శ్రేయస్సుకు పాటు పడే కుటుంబాలను గూర్చి చర్చించడం జరుగుతుంది. దత్తత పిల్లలు తమ జీవితాల్లో తగు చేయూత, ప్రేమ, శిక్షణ, విద్య, భద్రత లాంటివని పొందుతారు. ఈ రోజున దత్తత తీసుకున్న దంపతులు, దత్తతకు వెళ్లిన పిల్లలు నూతన కుటుంబ జీవితాలను అనుభవిస్తారు. దత్తత ప్రక్రియ పట్ల అవగాహన కలిపించడం, దీనికి సంబంధించిన సవాళ్లను అధిగమించడం జరుగుతుంది. అనాథ పిల్లల్ని ఆదుకునే ఒక పవిత్ర ప్రక్రియగా దత్తత గుర్తించబడింది.
పేగు బంధానికి సరిసమానంగా దత్తత బంధం నిలవాలని కోరుకుంటారు. అనాథ పిల్లల ఉజ్వల భవిత, కుటుంబాల్లో ప్రేమానుబంధాలు, సంతోషంగా కుటుంబ జీవితాలను గడపడం లాంటివని దత్తతతో ముడిపడి ఉంటాయి. దత్తత ఓ గొప్ప సమాజ సేవ అని, ప్రేమల పందిరి వలె పిల్లలతో కూడిన కుటుంబ వాతావరణం సృష్టించబడడానికి, అనాథ పిల్లలు తమ బాల్యాన్ని క్రమ పద్ధతిలో గడపడానికి దత్తత దోహదపడుతున్నది. అనాథ పిల్లలకు నమ్మకం, ప్రేమలు పరిచయం చేసే కుటుంబాలు లభిస్తాయి. దత్తత ద్వారా అధిక సంఖ్యలో అనాథ పిల్లల్ని కాపాడవచ్చని గమనించాలి. దత్తత ప్రక్రియలో ఓపిక, మార్గదర్శనం, చేయూత అవసరం అవుతాయి. దత్తత తీసుకోవడంలో పౌర సమాజం, సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం, అవగాహన వేదికలు, కుటుంబాలు, మిత్రులు లాంటి వారి సమన్వయం అవసరం అవుతుంది. ఒక పవిత్రమైన దత్తత ద్వారా ఇరుపక్షాలు తమ కోరికలను తీర్చకపోవడం జరుగుతుంది. దత్తతను ఒక శాశ్వత బంధంగా నిలుపుకుంటూ అనాథలు లేని పౌర సమాజ స్థాపనకు కృషి చేద్దాం.
బుర్ర మధుసూదన్‌రెడ్డి
9949700037