అమరావతి: మారేడుపల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మేటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు టెక్ శంకర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి పోలీసులు టెక్ శంకర్ మృతదేహంతో చేరుకున్నారు. మేటూరు జోగారావు మృతదేహం చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రజాసంఘాలు, సానుభూతిపరులు టెక్ శంకర్ కు తుది నివాళులర్పిస్తున్నారు. మారేడుపల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన శంకర్ మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగాడు. ఆంధ్రా-ఒడిశా బార్డర్ మావోయిస్టు పార్టీ ఇంచార్జిగా వ్యవహరించాడు. ఆయుధాలు తయారు చేయడంతో పాటు వాటి ఐఇడి నిపుణులుగా పేరొందాడు. మావోయిస్టు ఉద్యమంలో దశాబ్దాల నుంచి ఉండడంతో పోలీసుల రికార్డుల్లో మాత్రం శంకర్, బాబు, శివగా ఉన్నారు. అల్లూరి సీతారామారాజు జిల్లా రంపచోడవరం మండలం మారేడుమిల్లి ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో టైగర్ జోన్ పుల్లగండి అడవుల్లోని నల్లూరు జలపాతం వద్ద మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన సతీమణి రాజే, టెక్ శంకర్ తోసహా ఆరుగురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో హతమైన విషయం విధితమే.