ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఓ క్యాచ్‌ని అందుకొనే క్రమంలో శ్రేయస్‌కు గాయమైంది. అయితే శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి గురించి తాజాగా అప్‌డేట్ వచ్చింది. శ్రేయస్ రీ ఎంట్రీ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదిక ప్రకారం శ్రేయస్‌కు తాజాగా అల్రాసోనోగ్రఫీ స్కాన్ తీశారు. ఇందులో అతడి గాయం పూర్తిగా నయం కాలేదని తేలింది.
ప్రస్తుతం అతడు సాధారణ పనులు, తేలికపాటి కసరత్తులు మాత్రమే చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. హార్డ్ ట్రైనింగ్‌కు మరో నెల పాటు నిషేధం విధించారు. రెండు నెలల తర్వాత మరో స్కాన్ నిర్వహిస్తారు. దాని ఆధారంగా బిసిసిఐ సిఒఇలో అతడి రీహాబ్ ప్లాన్ అమలు కానుంది. ఈ సమాచారం నిజమైతే.. శ్రేయస్ మరో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడు. దీంతో అతడు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లకు దూరమవుతాడు. వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్‌లో శ్రేయస్‌ను మళ్లీ మైదానంలో చూసే అవకాశం ఉంది. దీంతో అతడి అభిమానులు నిరాశకు గురవుతున్నారు.