గౌహతి: సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరిగే రెండో టెస్ట్ కోసం భారత్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్‌లో జట్టు నుంచి కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ను తప్పించారు. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో గిల్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కేవలం మూడు బంతులు మాత్రమే ఎదురుకున్న గిల్ మెడ భాగంలో గాయంతో మైదానం వీడాడు. మ్యాచ్ పూర్తయ్యే వరకూ మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టలేదు. ఆ తర్వాత అతడిని వైద్యులు పరీక్షించారు. అయితే రెండో టెస్ట్ కోసం గౌహతి వెళ్లిన జట్టులో గిల్ కూడా ఉన్నాడు. కానీ, అతను గురువారం జరిగిన ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. దీంతో అతడిని రెండో టెస్ట్ జట్టు నుంచి రిలీజ్ చేశారు.
శుభ్‌మాన్ గిల్ స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టు నుంచి రిలీజ్ కావడంతో గిల్ ముంబైకి పయనమయ్యాడు. అక్కడే అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు. అయితే గిల్‌ను సెంటర్ ఆప్ ఎక్సలెన్స్‌లో ఉంచడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక తొలి టెస్ట్ మ్యాచ్‌లో 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో రెండో టెస్ట్‌లో టీం ఇండియా కచ్చితంగా విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం గౌహతిలో ఆటగాళ్లందరూ కఠోర సాధన చేస్తున్నారు.