థాయ్‌లాండ్‌లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఫాతిమా బాష్‌ను అందాల కిరీటం వరించింది. గత ఏడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ , ఫాతిమాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు. పోటీలో తొలిరన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్, రెండో రన్నరప్‌గా వెనెజువెలాకు చెందిన సిఫానీ అబాసలీ నిలిచారు. తరువాతి స్థానాల్లో ఫిలిప్పైన్స్‌కు చెందిన 28 ఏళ్ల అహతిస మనాలో, ఐవరీ కోస్ట్‌కు చెందిన 27 ఏళ్ల ఒలైవా యాస్ వచ్చారు.
భారత్‌కు తీవ్ర నిరాశ
ఈ పోటీల్లో భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నప్పటికీ టాప్ 30 వరకు మాత్రమే రాగలిగింది. ఆ తర్వాత న్యాయ నిర్ణేతలను ఆకట్టుకోవడంలో విఫలమైంది. టాప్ 12లో స్థానం సంపాదించలేకపోయింది. దీంతో భారత్‌కు ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం చేజారింది. జైపూర్‌లో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న మణిక మిస్ యూనివర్స్‌కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడానికి అర్హత సాధించినా చివరకు ఫలితం దక్కలేదు.
గళాన్ని గట్టిగా వినిపించిన ఫాతిమా
ఈ పోటీలు ప్రారంభమైనప్పటినుంచే మిస్ యూనివర్స్ ఫాతిమా పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది. థాయ్‌లాండ్ అధికారికి , ఈమెకు మధ్య జరిగిన వాగ్వివాదం ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్ అయి చివరికి బహిరంగ క్షమాపణలకు దారి తీసింది. ఆ సమయంలో ఫాతిమా తన గళాన్ని బలంగా వినిపించారు. అలాగే మిస్ యూనివర్స్ ఫైనల్లోనూ మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, మార్పులను ప్రస్తావించి జడ్జిల మనసు ఆకట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఈ పోటీల్లో ఫాతిమా ఒక షూట్‌కు హాజరు కాలేదు. మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్ ఆమె గైర్హాజరుపై ప్రశ్నించారు. తెలివితక్కువ వ్యక్తి అనే అర్థం వచ్చేలా ఆమెను నిందించడంతో ఆమె దీటుగా బదులిచ్చారు. “మీరు మమ్మల్ని గౌరవించినట్టే మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఇక్కడ నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా దేశ సంస్థతో మీకు ఏదైనా సమస్య ఉంటే అందులోకి నన్ను లాగకండి” అని తీవ్రంగా స్పందించారు. “ తొలుత నా మాట విని ,తర్వాత వాదించండి ” అంటూ నవాత్ బదులిచ్చారు. ఈ వాగ్వాదం ఫేస్‌బుక్‌లో లైవ్‌స్క్రీమింగ్ కావడం సంచలనం కలిగించింది.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించిన ఫాతిమా , మరికొందరు అందాల తారలు వేదిక నుంచి వాకౌట్ చేశారు. బయటకు వచ్చి మీడియా ముందు అసహనం వెలిబుచ్చారు. “ మీ డైరెక్టర్ గౌరవంగా వ్యవహరించలేదు. మనమంతా సాధికారత కలిగిన మహిళలం. ఇది మన గళాన్నివినిపించే వేదిక ” అని స్పష్టం చేశారు. ఆమె వాదాన్ని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా కొనియాడారు. మరోవైపు దీనిపై నవాత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొని బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ సంఘటనను మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. 25 ఏళ్ల ఫాతిమా మెక్సికోమోడల్‌గా రాణించారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ సెప్టెంబర్‌లో మిస్‌యూనివర్స్ మెక్సికోను దక్కించుకున్నారు. చిన్నప్పుడు డిస్లెక్సియా, హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు. తోటి పిల్లల నుంచి హేళనలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ తనను సేవామార్గం వైపు నడిపించాయని ఓ సందర్భంలో ఆమె వెల్లడించారు. ఈ ఆధునిక యుగంలో ఒక మహిళగా మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేందుకు మీరు ఈ కిరీటాన్ని ఎలా ఉపయోగిస్తారు ? అని తుది రౌండ్‌లో జడ్జీలు ప్రశ్నించగా “ భద్రత , సమాన అవకాశాల విషయంలో నేటికీ మహిళలు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. అలా అని నేటితరం తమ భావాలను వ్యక్తం చేసేందుకు ఏమాత్రం వెనుకాడదు. మార్పు కోరుకునే ధైర్యాన్ని కలిగి ఉన్నారు. మా గళాన్ని వినిపించేందుకు, మార్పు కోసం ఇక్కడ నిల్చొని ఉన్నాం. కలిసికట్టుగా చరిత్ర సృష్టిస్తాం ” అని ఆమె చెప్పిన సమాధానం న్యాయ నిర్ణేతల ప్రశంసలు చూరగొంది.