అమరావతి: ప్రభుత్వ పాఠశాలలో భవన నిర్మాణం పనులు జరుగుతుండగా ఉపాధ్యాయురాలిపై క్రేన్ పడడంతో ఆమె మృతి చెందింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజానగరం ప్రభుత్వ పాఠశాలలో జోష్నా బాయి అనే ఉపాధ్యాయురాలు పని చేస్తున్నారు. పాఠశాలలో భవన నిర్మాణం జరుగుతోంది. స్లాబ్ నిర్మాణం కోసం సామాగ్రిని తీసుకెళ్తుండగా ఉపాధ్యాయురాలిపై క్రేన్ కూలడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలలో భవన నిర్మాణ జరుగుతుండగా ఉపాధ్యాయురాలు చనిపోవడంతో హోమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేసింది. మృతురాలి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.