గౌహతి: రెండో టెస్టు కోసం ఆతిథ్య టీమిండియా గురువారం ముమ్మర సాధన చేసింది. గౌహతి వేదికగా శనివారం నుంచి భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టు కఠోర సాధనలో నిమగ్నమైంది. గురువారం కీలక ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. రిషబ్ పంత్, జడేజా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ తదితరులు కఠోర సాధన చేశారు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు రెండో, చివరి టెస్టు సవాల్‌గా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. దీంతో భారత ఆటగాళ్లు మ్యాచ్ కోసం తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. కాగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం సాధనకు దూరంగా ఉన్నాడు. మెడ నొప్పి గాయంతో గిల్ తొలి టెస్టు మ్యాచ్‌లో అర్ధాంతరంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. రెండో టెస్టులో అతను ఆడడం అనుమానంగా మారింది.