హైదరాబాద్: పదేళ్లు మంత్రిగా అనుభవం ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై కెటిఆర్ ఆరోపణలు చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కెటిఆర్ బాధ్యతాయుతంగా మాట్లాడలేదని, గత ప్రభుత్వంలో ఎవరికీ సంబంధం లేకుండా జివోలు ఇచ్చారని తెలియజేశారు. అనుమతులు లేకుండా ఎప్పుడూ చెల్లింపులు చేయలేదని, రాష్ట్ర ప్రజలకు కెటిఆర్ అసత్యాలు చెప్పారని, మొత్తం 9,292 ఎకరాల భూమి గురించి కెటిఆర్ మాట్లాడారని విమర్శించారు. పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భూములను తక్కువ ధరకు ఇస్తుందని, 2023లో బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు జివోలు ఇచ్చిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జివో ప్రకారం హైదరాబాద్ లోని భూములను ట్రాన్స్ ఫర్ కు అనుమతి ఇచ్చారని, ప్రభుత్వ భూమి అమ్ముకున్నట్లు కెటిఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. 6 నెలలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫ్రీహోల్డ్, ల్యాండ్ లీజ్ కు తేడాలేకుండా కెటిఆర్ మాట్లాడారని మండిపడ్డారు.
2023లో బిఆర్ఎస్ తెచ్చిన జివో ప్రకారమే భూములు ఇస్తున్నామని, భూమి హక్కుల ఉన్నవారికి మేలు చేయాలని చూస్తున్నామని చెప్పారు. బిఆర్ఎస్ హయాంలో చాలా భూములు బదిలీ చేశారని, పరిశ్రమలకు ఉపయోగపడాలని గ్రిడ్ పాలసీ తీసుకున్నారని అనుకున్నామని అన్నారు. పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టకూడదని, రాష్ట్ర ప్రగతిలో భాగంగా పాలసీ తీసుకున్నామని తెలిపారు. పెట్టుబడులు రాకూడదని, రాష్ట్ర అభివృద్ధి జరగకూడదనేది కెటిఆర్ ఆలోచనని దుయ్యబట్టారు. ఆధారాలు ఉంటేనే కెటిఆర్ మాట్లాడాలని సూచించారు. కెటిఆర్ కొంతమంది పేర్లు చెప్పారని, వారు ప్రభుత్వంలో లేరని అన్నారు. ఆధారాలు ఉంటే చెప్పండి.. చర్యలు తీసుకుంటామని, జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత బిఆర్ఎస్ కు చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పెట్టుబడులు రావాలని, రాయితీలు కూడిన పాలసీలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే భూములు ఇస్తున్నారని, పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి అనేదే తమ లక్ష్యం శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.