మన తెలంగాణ/హైదరాబాద్: రోజు రోజుకీ కోడిగుడ్డు సామాన్యుడికి అందకుండా పోతోంది. రి టైల్ మార్కెట్‌లో కోడి గుడ్డు ధర కూరగాయలతో పోటీపడుతోంది. ఇదివరకు కోడి గుడ్డు ధర తక్కు వ ఉండి, కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడంతో కోడి గుడ్లను వినియోగించుకునేందుకు ఆ సక్తి చూపించే వినియోగదారులు ఇప్పుడు కోడి గు డ్డు ప్రస్తుత ధర రూ.8 పైబడే అమ్ముతుండడంతో కొనలేక గుడ్లు తేలేస్తున్నారు. ఇలా కోడిగుడ్లు, కూ రగాయల ధరలు చుక్కలనంటుతుంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 670 నుంచి రూ.700 వరకు అమ్ముతుంటే, అదే రిటైల్ మార్కెట్‌లో ఆయా స్థానిక పరిస్థితులను బట్టి వంద కోడి గుడ్లు రూ-.800కి పైగానే అమ్ముతున్నారు. వారం పది రోజుల కిందట రూ.6 ఉన్న కోడి గుడ్డు రిటైల్ ధర శుక్రవారానికి రూ.8కి చేరింది. ఈ ధర ఇంకా పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. కోడి గుడ్ల ఉత్పత్తి, వినియోగంలోనూ దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో ఈ పరిస్థితి ఉంటే ఉత్పత్తి చాలా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో రిటైల్ ధర పరిస్థితి ఇంకెలా ఉంటుందని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణలోనే కాకుండా ఉత్పత్తి ఎక్కువ,
వినియోగంలోనూ ఎక్కువ ఉండి దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. సహజంగానే ధరతో సంబంధం లేకుండా కోడి గుడ్ల వినియోగం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వ అవసరాలైన వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల సరఫరా పెద్ద ఎత్తున జరుగుతుంది. వినియోగదారుల అవసరాలు భారీగా ఉండడంతో డిమాండ్ ఎప్పుడు ఫుల్‌గా ఉంటుంది. దీంతో అటు ఉత్పత్తి తగ్గినా, డిమాండ్ ఒక్కసారి పెరిగినా కోడి గుడ్ల ధరలపై ప్రభావం పడుతుంది. ఇప్పుడు కూడా ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు రికార్డు స్థాయికి కోడి గుడ్డు ధర చేరింది. దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, ప్రపంచ దేశాల్లో భారతదేశం మూడో స్థానంలో ఉందని ఫౌల్ట్రీ వర్గాల సమాచారం. ఏపి తర్వాత తెలంగాణ కోడిగుడ్ల లభ్యత, వినియోగంలో రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో కోళ్ల పరిశ్రమ ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కామారెడ్డి జిల్లా, నాగర్ కర్నూల్ వంటి జిల్లాల్లో కేంద్రీకృతమై ఉంది. కామారెడ్డిలో అతిపెద్ద పౌల్ట్రీ ఫామ్‌లు ఉండగా, హైదరాబాద్‌లో అనేక ఫామ్‌లు, హేచరీలు, ఫీడ్ మిల్లులు ఉన్నాయి.
కోడి గుడ్లకు డిమాండ్ పెరగడం వెనుక కారణం ఇదీ..
మార్కెట్ వర్గాల అంచనా మేరకు కోడిగుడ్ల ధరలు వారం పది రోజుల్లో పెరగడానికి కారణం రెండు రకాలుగా చెబుతున్నారు. కోళ్లు పలు విధాలుగా చనిపోవడం వల్ల ఉత్పత్తి తగ్గడం ఒక కారణమైతే, ఉత్తరాది రాష్ట్రాలకు కోడి గుడ్ల ఎగుమతులు పెరగడం వల్ల డిమాండ్ అనూహ్యంగా పెరగడం మరో కారణంగా విశ్లేషిస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణలో కోళ్ల ఫామ్‌లలో వ్యాధుల కారణంగా అధిక సంఖ్యలో కోళ్లు మరణించడంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని చెబుతున్నారు. గుడ్డు పౌష్టికాహారమని, రోజూ తినాలని డాక్టర్లు సూచిస్తుండడంతో వీటి వినియోగం క్రమేణా పెరుగుతూ వచ్చింది. కోడిగుడ్డును తమ రోజువారీ ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే రోజుకు కోటి కోడి గుడ్లకు పైగా ఆహారంలో భాగంగా స్వీకరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రోజుకు వినియోగించే గుడ్ల సంఖ్య మూడు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా. అయితే వర్తక వర్గాల సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా రోజుకు 30 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతుండగా తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 6 కోట్లకు పైగానే కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది.
ఉత్పత్తి అంచనాలు ప్రతి రోజు స్థిరంగా ఉండకపోయినప్పటికీ కొంచెం ఎక్కువ, తక్కువ ఉన్నా ఇదే స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచే కోడి గుడ్లు ఉత్పత్తి ఎక్కువ అవుతుండగా, వాటి వినియోగంలో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా ఉండడంతో డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం వల్ల కోడి గుడ్ల ధరలు పతాక స్థాయికి చేరుతున్నాయని చెబుతున్నారు. కోడిగుడ్లు ఇప్పుడు డజన్ ధర రూ.70 నుంచి 80 మధ్య అమ్ముతుంటే రానున్న నెల రోజుల్లో డజన్ గుడ్లు వందకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కోడిగుడ్లతో సరిపెట్టుకునే మధ్య తరగతి కుటుంబాలకు ఇలా కోడిగుడ్ల ధరలు రోజు రోజుకీ పెరగడం మరింత భారంగా వాపోతున్నారు. కార్తీక మాసం ముగియడంతో కోడిగుడ్ల వినియోగం కూడా పెరగడంతో ధరలు పెరిగేందుకు దోహదపడిందని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో వినియోగం ఎక్కువ
కోడి గుడ్లను వినియోగించే వారిలో ఏపి, తెలంగాణ తర్వాత మిజోరాం, అసోం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిగుడ్డు వినియోగం, లభ్యతలో దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని కేంద్ర పశు సంవతర్ధక మంత్రిత్వ శాఖ 2022 సర్వే-లో తెలిపింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్లో తలసరి గుడ్ల లభ్యత చాలా ఎక్కువగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి గుడ్ల తలసరి లభ్యత 501గా ఉందని సర్వే వివరాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం గుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. కాగా తెలంగాణలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. తెలంగాణలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత 442 కాగా దేశ వ్యాప్తంగా తలసరి గుడ్ల లభ్యత 95గా ఉంది. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో టాప్ ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్నాటక రాష్ట్రాల్లోనే 64.56 శాతం గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని సర్వే పేర్కొంది. ఉత్పత్తిలో ఎక్కువ భాగంగా ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాలకు పంపించడం వల్ల స్థానిక వినియోగానికి తక్కువ అవుతున్నాయి. దీంతో ధరల పెరుగుదలకు దోహదపడుతుందని చెబుతున్నారు.