హైదరాబాద్: ఐ బొమ్మ రవికి సైబర్ క్రైమ్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. మిగతా కేసుల్లో కూడా అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. మిగతా కేసుల్లో అరెస్ట్ కోసం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుపై మరో నాలుగు కేసులు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసి సినిమా రాకెట్‌లో కీలక సూత్రధారి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, బప్పం, ఐ రాధ టివి పేర్లతో వెబ్‌సైట్‌లు రూపొందించి గత ఏడేళ్లుగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు వేదికగా మార్చిన ఇమ్మడి రవిని కూకట్‌పల్లిలో అరెస్ట్ చేసిన విషయం విధితమే. అరెస్ట్ చేసిన అనంతరం ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో రూ.3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా కోట్ల లావాదేవీలు జరిగాయని, ఇందులో మనీ లాండరింగ్ అంశం జరిగిందా అనే కోణంలో ఇడి ఆరా తీస్తోంది.