సమాజం ఎంత వేగంగా మారిపోతోందో చెప్పాలంటే, మన చేతిలో ఉన్న చిన్న మొబైల్‌నే చూడాలి. ఒకప్పుడు వార్తలు పత్రికల ద్వారా ఉదయం ఒక్కసారి చేరేవి. ఇప్పుడు క్షణక్షణం సమాచారం మన ముందుకొస్తోంది. కాని ఈ వేగం మనలో ఆలోచనలకు అవకాశం ఇవ్వకుండా చేస్తోంది. మనం చూసే ప్రతి పోస్టు, చదివే ప్రతి వాక్యం, వినే ప్రతి చిన్న క్లిప్ మన భావోద్వేగాలకు నేరుగా తాకుతోంది. ఇక్కడే సోషల్ మీడియా చూపించే అందమైన వెలుగుల వెంట వచ్చే కనిపించని అంధకారం మొదలవుతుంది. అనుకుంటే ఎంత మంచి ప్రపంచం ఇది. ప్రపంచం నలుమూలలనుంచి వచ్చే అభిప్రాయాలు, కొత్త ఆలోచనలు, మనమే చెప్పకుండా మనకోసం ఆగి వినే వేదిక. కానీ ఈ స్వేచ్ఛే కొన్నిసార్లు మనల్నిమనమే తప్పుదారిలోకి నెట్టేస్తుంది. నిమిషానికి వేల పోస్టులు అప్‌డేట్ అయ్యే ఈ ప్రవాహంలో నిజమా అబద్ధమా అనే తేడా గుర్తించడం కష్టంగా మారిపోతోంది. వేగమే ముఖ్యమయింది, నిజం రెండో స్థానానికి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితిలో యువత ఎంత సులువుగా ప్రభావితమవుతారో అంచనా వేయడం కష్టమే. స్మార్ట్‌ఫోన్‌లో కనిపించే ప్రతి పోస్టు మనసు లో చిన్న అలలు రేపుతూనే ఉంటుంది. ఇతరులందరూ ఎంతో బాగా ఉన్నారేమో!, నేను మాత్రం ఎందుకు ఇలాగే? అనే అనుమానాలు నెమ్మదిగా పెద్ద భావోద్వేగ ఒత్తిడులుగా మారతాయి.
సోషల్ మీడియాలో కనిపించే జీవితాలన్నీ నిజానికి ఒక గొప్ప ప్రదర్శనే. వెలుగువైపు మాత్రమే చూపించే ఆ ఫోటోల వెనక మనకు తెలియని చీకట్లు ఉంటాయి. కానీ యువతకి అవి కనిపించవు. వారు చూస్తుంది కేవలం మెరుపు, కాని ఆ మెరుపు వెనుక ఉన్న మేఘాన్ని గుర్తించడం ఇంకా నేర్చుకోని వయసు. తరచూ స్క్రోల్ చేస్తూ ఉండటం అనేది ఒక అలవాటుగా మొదలై, మెల్లగా ఒక అవలంబనగా మారుతుంది. రోజుకు గంటలోపే స్క్రీన్ చూశామన్న భావన ఉన్నా, వాస్తవంలో గంటలు గడిచిపోతాయి. ఆ సమయంలో మనసు బయట ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోతుంది. కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నా, మాట్లాడటానికి సమయం లేకుండా పోతుంది. వ్యక్తిగత సంబంధాల్లో కనిపించని గీతలు ఏర్పడతాయి. నమ్మకాల బంధాలు సామాన్యమైన అపార్థాలతోనే దెబ్బతింటాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వ్యాఖ్యను మనసులో పెట్టుకోవడం, ప్రతి మాటను వ్యక్తిగతంగా తీసుకోవడం అలవాటైపోతుంది. కొన్నిసార్లు ఒక పదం, ఒక్క ఫోటో, ఒక చిన్న వీడియో తప్పుగా అర్థమైపోతుంది. ఆ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకునే లోపే తీర్పులు వేయడం మొదలవుతుంది.
ప్రజల భావోద్వేగాలకు ఈ వేదికల ప్రభావం అంత ఎక్కువగా ఉండటంతో, నిజానికి సంబంధం లేకుండా విమర్శలు వెల్లువెత్తుతాయి. అలా నిర్దోషులైన వారు అనవసర వివాదాలకు గురవడం జరుగుతూనే ఉంది. తీర్పు వేగంగా కానీ ఆలోచన నెమ్మదిగా ఈ విరుద్ధం సోషల్ మీడియా యుగానికి ప్రతీకగా మారింది. అయితే ఇది పూర్తిగా ప్రతికూలమైన వేదిక అని చెప్పడం అన్యాయం. ప్రపంచానికి అనుసంధానమైన అవకాశాలు, ప్రతిభను ప్రదర్శించే దారులు, సమాచారం పంచుకునే స్వేచ్ఛ ఇవన్నీ ఈ వేదిక ఇచ్చిన గొప్ప వరాలు. ఒక చిన్న గ్రామంలో ఉన్న ప్రతిభావంతుని పాట లేదా కవిత ప్రపంచం వరకు చేరడానికి ఇదొక బలమైన వేదిక. సహాయం కావాల్సిన వారికి క్షణాల్లో మద్దతు అందించే వేదిక కూడాను. కానీ ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఈ వేదికను మనం ఎంత బాధ్యతతో వాడుతున్నాం? సమాచారం అందుబాటులోకి వచ్చిందనే కారణంతోనే అది నిజం అవ్వదు. ప్రతీ పోస్టునూ, ప్రతీ మాటనీ గుండెల్లో పెట్టుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఇది నిజమా?, దీనికి ఆధారం ఉందా?, దీని వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా? అనే మూడు చిన్న ప్రశ్నలు అడిగితే చాలా వదంతులు ఆగిపోతాయి. యువతలో ఈ ఆలోచన అలవాటు పెంచడం అత్యంత అవసరం.
మరొక ముఖ్యమైన విషయం -డిజిటల్ ప్రవర్తన. ఒకరి జీవితంపై కావాలనే వ్యాఖ్యలు చేయడం, మనసుకు నొప్పిచేసే మాటలు రాయడం చాలా సులభమైపోయింది. కానీ ఆ మాటను చదివే వ్యక్తి హృదయంలో అది ఎలాంటి గాయాన్ని చేస్తుందో మనకు తెలియదు. సోషల్ మీడియా మనలను వ్యక్తీకరణ వైపు దగ్గర చేస్తున్నప్పటికీ, మనసులను కూడా దూరం చేస్తున్న విరుద్ధ ప్రపంచంగా మారిపోతోంది. తల్లిదండ్రులు కూడా ఈ మార్పును అర్థం చేసుకోవాలి. పిల్లల చేతుల్లో ఫోన్ ఉన్నంతసేపు ప్రమాదం ఉన్నట్టే కాదు; పక్కనే ఉన్నప్పటికీ అర్థం చేసుకునే సంభాషణలు తగ్గిపోతే అదే పెద్ద ప్రమాదం. వారి మనసులో ఏముంది? ఏ వీడియోలు చూస్తున్నారు? ఏ విషయాలు ప్రభావం చూపుతున్నాయి? ఇవన్నీ తెలుసుకోవడం సంరక్షణలో భాగమే. నిషేధాలు పెట్టడం కాదు; అవగాహన కల్పించడం ముఖ్యం. ఇక చివరిగా, సోషల్ మీడియా జీవితం మొత్తం కాదు. అది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ప్రపంచం ఎంత పెద్దదో, మనుషులు ఎంత విలువైనవారో, ప్రత్యక్షంగా మాట్లాడితేనే తెలుస్తుంది. మనసు మన వ్యక్తిత్వానికి అద్దం. ఆ అద్దం స్క్రీన్ వెలుగులో కాకుండా మనసులో వెలిగితేనే జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ మీడియా మనల్ని కలపడానికి వచ్చింది.
మనల్ని విడదీయడానికి కాదు. తప్పుదోవలు గుర్తించి, సరైన దారిలో వినియోగిస్తే అది శక్తి. ఆలోచించకుండా ఉపయోగిస్తే అది నీడ. నీడను వెలుగుగా మార్చే బాధ్యత మాత్రం మనదే. సోషల్ మీడియా మన జీవితాల్లోకి వచ్చిన మార్పులను పూర్తిగా నిరాకరించే స్థితి ఇప్పుడు మనకు లేదు, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం మాత్రమే ఈ సమస్యలకు స్థిరమైన పరిష్కారం. యువతలో డిజిటల్ నియమ శిక్షణను పెంచడం, సమాచారం పంచుకునే ముందు నిజానిజాలను ధ్రువీకరించుకోవడం, వ్యక్తిగత గోప్యతను కాపాడుకునే అలవాటు, ఇతరుల జీవితాలను తమతో పోల్చుకోకుండా స్వంత ప్రయాణానికి విలువ ఇవ్వడం- ఇవన్నీ తప్పుదారుల్లోంచి బయటపడే మొదటి అడుగులు. కుటుంబాలు పిల్లలతో సంబంధాన్ని మరింత దగ్గరగా ఉంచి, రోజులో కొంతసేపైనా మొబైల్ లేకుండా జీవించే సంస్కృతిని ప్రవేశపెడితే డిజిటల్ భారాన్ని తగ్గించవచ్చు. యువతకు వేదికల ప్రభావం ఎంత గణనీయమో చెప్పి, లోపలున్న భావోద్వేగ దృఢత్వాన్ని పెంపొందించటం అత్యంత ముఖ్యం. ఇదే సమయం లో సోషల్ మీడియా సంస్థలు కూడా మార్గనిర్దేశక విధానాలు, నమ్మకమైన సమాచారం ప్రోత్సాహం, హానికర కంటెంట్‌ను వెంటనే నియంత్రించే వ్యవస్థలను బలపరచాలి. డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా త్యజించడం కాదు; దానికి బానిస కాకుండా దానిపై అధిపత్యం సాధించడం అసలైన పరిష్కారం.
– చిటికెన కిరణ్ కుమార్
94908 41284