సిగాచి ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. సిగాచి ప్రమాద బాధితులకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇప్పటికీ అందలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికుల కుటుంబాలు రో డ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని ‘సిగాచి‘ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి, నాలుగు నెలలు గడిచిందని పేర్కొన్నారు. 54 మంది కార్మికులను పొట్టనపెట్టుకున్న నాటి దుర్ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతున్నదని అన్నారు. ఆనాడు ప్రమాద స్థలానికి వచ్చి, మృతదేహాల సాక్షిగా మీరు ఇచ్చిన హామి ఇప్పటివరకు నెరవేర్చకపోవడం శోచనీయం అని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. పైగా పరిహారం అందించినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలకే విలువ లేకుంటే ఇక ఆ బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని అడిగారు.
సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. ప్రమాదం జరిగిన జూన్ 30న సిఎం స్వ యంగా వచ్చి, మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పు న పరిహారం అందిస్తామని ఘనంగా ప్రకటించారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మీడియా సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, పరిహారా న్ని పరిహాసంగా మార్చారని మండిపడ్డారు. నాలుగు నెలలు గడిచినా పరిహారం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని అన్నారు. గడిచిన నాలుగు నెలల్లో బాధితుల చేతికి అందింది కేవలం రూ. 26 లక్షలు మాత్రమే అని, ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి ఇంకా రూ. 74 లక్షలు బాకీ పడ్డారని పేర్కొన్నారు. ఇది మాట తప్ప డం కాదా..? అని ప్రశ్నించారు. కార్మిక శాఖ మంత్రి నిస్సిగ్గుగా బాధితులకు రూ.40 నుండి 50 లక్షలు అం దించామని ప్రకటించడం అత్యంత శోచనీయం అని పేర్కొన్నారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా ప్రభుత్వం ఇప్పించే నష్టపరిహారంలో
కలిపి లెక్కలు చెప్పడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రకటించిన రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ఇప్పటికీ బాధితులకు అందలేదని అన్నారు. కేంద్రంతో మాట్లాడి ఆ డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని సాక్షాత్తు హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసినా మీలో చలనంలేదని విమర్శించారు.