మన తెలంగాణ/హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 22న ఆగ్నే య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప డే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తదుపరి 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయు వ్య దిశలో కదులుతూ మరింత బలపడి ఈనెల 24 నాటికి వాయుగుండంగా మా రే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 48 గంటల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాగల 2రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుండి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రం మొత్తం చలితో గజగజ : కొద్దిరోజులుగా సాయంత్రం 5 గంటలు అయ్యిందంటే చాలు రాష్ట్రం మొత్తం చలితో గజగజా వణికిపోతోంది. ఉదయం 9 గంటలైనా ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంది. రాత్రి నుంచి ఉదయం వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 7 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి 7.1, ఆదిలాబాద్ 7.7, వికారాబాద్ 8.1, రంగారెడ్డి 8.2, కామారెడ్డి 8.5, సిద్దిపేట 8.6, నిజామాబాద్ 8.9, జగిత్యాల 9, మెదక్ 9.3, నిర్మల్ 9.4, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 9.9 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి.
ఈదురుగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత పది రోజులుగా చలి తీవ్రత ఉధృతంగా కొనసాగుతుండగా మరింత అధికమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల సెల్సియస్‌కు చేరగా మిగిలిన జిల్లాల్లో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు కూడా 27.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గటంతో పొద్దంతా కాస్తా చలితో కూడిన వాతావరణం ఉంటోంది. ఉష్ణోగ్రతల తగ్గుదలకు తోడుగా ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు చలి ప్రభావానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గాలిలో పెరిగిన తేమ శాతం
అధిక వర్షాలతో నేలలు చిత్తడిగా మారి గాలిలోని తేమశాతం పెరగటం, ఉత్తర భారతదేశం నుంచి చలి గాలులు వీస్తుండటం, వాతావరణ మార్పుల ప్రభావంతో నవంబరు మాసంలో సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సాధారణంగా డిసెంబరు నెలలో చలి అధికంగా ఉంటుంది. కానీ ఈ సీజన్‌లో మాత్రం నవంబరు నెల నుంచే చలి పంజా విసరుతోంది. తెలంగాణలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది తెలంగాణకు ఉన్న ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితి. ఏపీతో పోలిస్తే తెలంగాణ ఉత్తర, మధ్య భారతదేశానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇటీవల ఆ ప్రాంతాల్లో అధిక పీడనం ఏర్పడింది. దాని వల్ల అక్కడి నుంచి చల్లని, పొడి గాలులు దక్కన్ పీఠభూమిపై ఉన్న తెలంగాణ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది.