ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ జిల్లాల పర్యటన ఉండనుంది. డిసెంబర్ 1వ తేదీన నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి ఈ పర్యటన మొదలుకానుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. దీంతోపాటు స్థానిక సంస్థలు కూడా త్వరలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతోపాటు డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో ప్రజా పాలన ఉత్సవాలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. జిల్లాల పర్యటనకన్నా ముందే ముఖ్యమంత్రి వివిధ శాఖల్లో జరిగిన అభివృద్ధిపై సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలిసింది.
పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
పర్యటనలో భాగంగా వివిధ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించడంతో పాటు ప్రజా సభల్లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండు సంవత్సరాల పాలనను ప్రజలకు వివరించడం, కొనసాగుతున్న సంక్షేమ-ం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం గా తెలుస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగనుంది. ఈ అంతర్జాతీయ సమ్మిట్‌లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047ను విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.