ఎర్రకోట వద్ద పేలుడు కేసు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గురువారం ముగ్గురు డాక్టర్లను, ఓ మత బోధకుడిని అదుపులోకి తీసుకుంది. 15 మంది మృతికి దారితీసిన పేలుడు ఘటన వెనుక భారీ స్థాయి వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఉన్నట్లు గుర్తించారు. దీనితో పలు రాష్ట్రాలలో మూలాలను వెతికి పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇంతకు ముందు అరెస్టు సిన ముజమ్మిల్ గనియి, అదీల్ రథెర్, షహీనా సయీద్‌లను ఎన్‌ఐఎ తమ కస్టడీకి తీసుకుంది. వీరితో పాటు మత ప్రచారకుడు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వాఘే కూడా ఉన్నారు. ఉగ్ర నిరోధక సంస్థ వీరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణకు గట్టి బందోబస్తు నడుమ శ్రీనగర్ నుంచి తీసుకువెళ్లింది. విచారించడం ద్వారా ఉగ్రలింక్‌లు ఇతరత్రా కుట్ర సమాచారం రాబట్టేందుకు రంగం సిద్ధం అయింది.
ఢిల్లీలోని పాటియాలా కోర్టు నుంచి జిల్లా సెషన్స్ జడ్జి నుంచి అనుమతి పొందిన తరువాత వీరిని గట్టి బందోబస్తు నడుమ శ్రీనగర్‌లో ఎన్‌ఐఎ బృందాలు కస్టడీకి తీసుకున్నాయని అధికారులు తెలిపారు. ఇటీవలే ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు అమిర్ రషీద్ అలీ, జాసిర్ బిలాల్ వనీ అలియాస్ డాన్షిన్‌ను అరెస్టు చేశారు. ఇప్పుడు ముగ్గురు అదుపులోకి రావడంతో ఎన్‌ఐఎ విచారణ పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఇక పేలుడు కేసులో నిందితులు అయిన మరో నలుగురిని కూడా ఢిల్లీ కోర్టు ఎన్‌ఐఎ కస్టడీకి అనుమతించింది. వీరిని కూడా కశ్మీర్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి, విచారిస్తారు. ఇప్పుడు పట్టుబడ్డ , కస్టడీకి తీసుకున్న నలుగురిని పది రోజుల ఎన్‌ఐఎ విచారణకు పాటియాలా కోర్టు అనమతిని ఇచ్చింది.